Teluguwonders:
💥శ్రావణ శుక్రవారం నాడు జరిగిన మహా పాతకం :
విజయవాడ శివార్లలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో రాత్రికి రాత్రి 101 ఆవులు మరణించడం వెనుక అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. విషం కలిపిన దాణాను గోవులకు తినిపించి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆవుల కడుపులో పచ్చగడ్డి తప్ప మరేమీ లేనప్పటికీ.. నరాలు చిట్లిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. విషపూరితమైన పచ్చగడ్డి తింటే గానీ ఇలాంటి పరిస్థితి తలెత్తదని ఆవుల కళేబరాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించిన డాక్టర్లు ధృవీకరించారు. ఆ విషం ఎలా వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. మరోవంక- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించారు. ఇది కుట్రేనని ఆయన తేల్చేశారు. రాత్రికి రాత్రి వందకుపైగా ఆవులు మరణించడం సాధారణ విషయం కాదని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
🔴విష ప్రయోగమే..!?
తాడేపల్లిలోని గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. వాటికి పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టమ్ నివేదిక ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ.. ఆవుల మృతికి విష ప్రయోగమే ప్రధాన కారణమై ఉంటుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇదివరకు ఇదే గోశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 24 గోవులు చనిపోయిన విషయం తెలిసిందే. సుమారు 40 ఆవుల కళేబరాలకు డాక్టర్లు పోస్టుమార్టం చేశారు. వాటన్నింటి కడుపులో పచ్చగడ్డి ఉంది. అదే సమయంలో- నరాలు చిట్లిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. నరాలు చిట్లడం అనేది అసాధారణ అంశం. విషం కడుపులోకి వెళ్తేనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని డాక్టర్లు వెల్లడించారు.
🔴 వరలక్ష్మి వ్రతం రోజు :
అద్దంకి నుంచి దాణా ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి శుక్రవారం ఈ గోశాల కోసం దాణా తెప్పించారు. ఇక్కడే ప్రమాదకరమైన, విషపూరితమైన దాణా కలిసి ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించారు. శ్రావణ మాసం శుక్రవారం, వరలక్ష్మి వ్రతం వల్ల వందలాది మంది భక్తులు తాడేపల్లి గోశాలకు చేరుకుని పండ్లు, గడ్డి వంటి మేతను ఆవులకు పెట్టారు. కొన్నింటిని గోశాల నిర్వాహకులకు అందజేశారు. భక్తులు ఇచ్చిన పదార్థాల్లో విషం కలిసిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కుట్రపూరితంగా ఎవరైనా విషం కలిపిన పదార్థాలను ఆవులకు తినిపించి ఉండటమో లేదా, గోశాల నిర్వాహకులకు అందజేయడమో చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దాణాను తిన్న కొద్దిసేపటికే ఆవులు ఒక్కొక్కటిగా నురగలు కక్కుకుంటూ మృత్యువాత పడ్డాయి.
విజయవాడ శివారు గోశాలలో ఒక్క రాత్రిలో 100 ఆవులు మరణించడం అన్నది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకోలేం. రాత్రికి రాత్రి అలా జరగడం వెనుక మరేదో కుట్ర ఉంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా కేసును విచారించి, మూగప్రాణులను బలి తీసుకున్న దోషులను పట్టుకుని శిక్షించాలి.
🔴ఘటనపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు..:
చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించారు.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రమాదావశావత్తూ చోటు చేసుకునే ఘటన కాదని ఆయన స్పష్టం చేశారు. `విజయవాడ శివారు గోశాలలో ఒక్క రాత్రిలో 100 ఆవులు మరణించడం అన్నది ప్రమాదవశాత్తు జరిగిందని అనుకోలేం. రాత్రికి రాత్రి అలా జరగడం వెనుక మరేదో కుట్ర ఉంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా కేసును విచారించి మూగ ప్రాణులను బలితీసుకున్న దోషులను శిక్షించాలి.. అంటూ ట్వీట్ చేశారు.
ఇది కుట్రేనని ఆయన తేల్చేశారు. రాత్రికి రాత్రి వందకుపైగా ఆవులు మరణించడం సాధారణ విషయం కాదని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
🔴విచారణకు కమిటీ :
చనిపోయిన ఆవులకు గోశాల ప్రాంగణంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఆవులకు వేసిన దాణా నమూనాలను పరీక్షలకు తరలించారు. గోవులకు ఇస్తున్న నీటిని, చుట్టుపక్కల ఉన్న నీటి నమూనాలను గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులు సేకరించారు. మృతి చెందిన గోవులను గోశాల ప్రాంగణంలోనే ఖననం చేశారు. ఘటనా స్థలాన్ని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్‌కలెక్టర్ మిషాసింగ్ పరిశీలించారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చెప్పారు.ఘటనపై పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.