ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారంటే.. ఎందుకు వెళ్తున్నారు డబ్బు సంపాదన కోసమే . అలా వెళ్లి ఆయా దేశాల కరెన్సీని సంపాదించి దాన్ని భారతీయ కరెన్సీకి మార్చి తమ తమ ఇళ్లకు పంపిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది . మరి ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీ విలువ ఎక్కువ..? ఏ దేశ కరెన్సీకి బాగా డిమాండ్ ఉంది..? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.ఆయా దేశాల కరెన్సీలు..వాటి గరిష్ట విలువలను బట్టి ఇలా ఉన్నాయ్…
♦1. కువైట్ దీనార్: భారత్ నుంచి పెద్ద సంఖ్యలో వలస వెళ్లే దేశాల లిస్టులో కువైట్ కూడా ఒకటి. ఈ దేశపు కరెన్సీ పేరు కువైట్ దీనార్. ఒక కువైట్ దీనార్ విలువ దాదాపు 3.29 అమెరికన్ డాలర్లు ఉంటుంది. అంటే ఒక్క కువైట్ దీనార్ విలువ దాదాపు 231.16 రూపాయలన్నమాట. 2013 నుంచి ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దీనారే ఉంటోంది. దీనికి ప్రధాన కారణం ఆ దేశంలోని ఆయిల్ నిల్వలే.
♦2. బహ్రెయిన్ దీనార్:
కువైట్ తర్వాత అత్యంత విలువైన కరెన్సీ కలిగిన దేశం బహ్రెయిన్. ఇక్కడి కరెన్సీ పేరు బహ్రెయిన్ దీనార్. ఒక్కో బహ్రెయిన్ దీనార్ విలువ 2.65 డాలర్లు. అంటే 186.58 రూపాయలన్నమాట. ఈ గల్ఫ్ దేశంలోని బొగ్గు నిల్వలే దీని ప్రధాన ఆదాయ మార్గం. ఇంకో విషయమేంటంటే అమెరికన్ డాలరుపై బహ్రెయిన్ దీనార్ ఆధిపత్యం 2005 నుంచి కొనసాగుతూనే ఉంది.
♦3. ఒమన్ రియాల్: కువైట్, బహ్రెయిన్ దేశాల తర్వాత కరెన్సీ మారకంలో మూడో స్థానంలో ఉన్న దేశం. “ఒమన్” ఇక్కడ కరెన్సీని రియాల్స్‌లో కొలుస్తారు. ఒక్కో ఒమనీ రియాల్ విలువ 2.60 డాలర్లు. అంటే 182.68 రూపాయలతో సమానం. ఈ దేశ కరెన్సీ ఎంత విలువైనదంటే.. రోజువారీ ఖర్చుల కోసం ఆ దేశంలో పావు రియాల్, అర్ధ రియాల్ నోట్లు ముద్రించాల్సి వచ్చింది.
♦4. జోర్డాన్ దీనార్: ఈ వరుసలో నాలుగో స్థానంలో జోర్డానియన్ దీనార్ నిలిచింది. ఆర్థికంగా పెద్దగా అభివృద్ధి చెందని ఈ దేశపు కరెన్సీకి ఎందుకింత విలువ ఉందో చెప్పడం ఒకింత కష్టమే. ఏది ఏమైనా ఒక్క జోర్డాన్ దీనార్ విలువ 1.41 అమెరికన్ డాలర్లతో సమానం. అంటే మన కరెన్సీలో 99.22 రూపాలన్నమాట. ఈ దేశంలో ముఖ్యమైన సహజ వనరులు కూడా పెద్దగా లేకపోవడం గమనార్హం.
♦5. బ్రిటిష్ పౌండ్ (స్టెర్లింగ్): ఖరీదైన కరెన్సీ కలిగి ఉన్న దేశాల్లో బ్రిటన్ ఐదో స్థానంలో నిలిచింది. గతంలో బ్రిటన్ ఆధీనంలో ఉండి తర్వాత స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన చాలా కాలనీలు.. తమ తమ సొంత కరెన్సీని ముద్రించుకుంటున్నాయి. ఈ వరుసలో స్కాటిష్, నార్త్ ఐర్లాండ్, మాంక్స్, జెర్సీ, గర్న్సీ, జీబ్రాల్టర్ పౌండ్లు.. అదే విధంగా సెయింట్ ఎలెనా ఐలాండ్, ఫాక్‌లాండ్ పౌండ్లు ఉన్నాయి. అయితే వీటన్నింటి విలువ ఇంచుమించుగా బ్రిటన్ పౌండుకు సమానంగానే ఉంటుంది. ఒక్కో బ్రిటీష్ పౌండు 1.26 అమెరికన్ డాలర్లకు సమానం. అంటే సుమారు రూ. 89.47 అన్నమాట.
♦6. కేమాన్ ఐలాండ్ డాలర్: ఈ వరుసలో ఆరో స్థానంలో ఆశ్చర్యకరంగా కేమాన్ ఐలాండ్ నిలిచింది. ప్రపంచంలో ట్యాక్సుల విషయంలో వినియోగదారులకు ఎంతో సౌలభ్యంగా ఉండే దేశాల్లో కేమాన్ ఐలాండ్ ఒకటి కావడమే దీనికి కారణం. వందలకొద్దీ బ్యాంకులకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు లైసెన్సులిచ్చిందీ దేశం. ఒక్కో కేమాన్ ఐలాండ్ డాలర్ 1.22 అమెరికన్ డాలర్లకు సమానం. మన రూపాయల్లో దీని విలువ సుమారు రూ.88.45.
♦7. యూరోపియన్ యూరో: ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాలు యూరప్‌లోనే ఉన్నాయి. అందుకే యూరోపియన్ యూరో విలువ కూడా అధికంగానే ఉంటోంది. ప్రపంచ దేశాలు అమెరికన్ డాలరు తర్వాత యూరోలోనే తమ నిల్వలను దాచుకుంటాయి. అందుకే ప్రపంచ సంపద నిల్వల్లో 22 శాతంపైగా యూరోలోనే ఉన్నాయి. ఇంత ప్రముఖమైన ఈ యూరో విలువ రూ.78.56కు సమానం.
♦8. స్విస్ ఫ్రాంక్: ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటైన స్విట్జర్లాండ్.. తన స్థానాన్ని చాలా జాగ్రత్తగా సుస్థిరం చేసుకుంటోంది. బ్యాంకులు, ట్యాక్సుల విషయంలో ఎంతో రక్షణాత్మకంగా ఉండే ఈ దేశంపై ప్రపంచంలోని ఎందరో ధనికులు ఆధారపడుతున్నారు. వీరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న స్విట్జర్లాండ్.. తన విలువ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటోంది. అందుకే ప్రపంచ మార్కెట్లో ఒక్క స్విట్జర్లాండ్ ఫ్రాంక్ విలువ దాదాపు 1.04 అమెరికన్ డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో 69.59 రూపాయలకు సమానం.
♦9. యూఎస్ డాలర్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్దన్నలాంటి అమెరికా కరెన్సీ యూఎస్ డాలర్. దీంతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ చెల్లింపులు చేసుకోవచ్చు. ఆయా దేశాలు తమ సంపదలను కూడా యూఎస్ డాలర్ల రూపంలోనే దాచుకుంటాయంటేనే ఆర్థికరంగంలోన అమెరికన్ డాలరుకు ఉన్న ప్రాముఖ్యంత తెలిసిపోతుంది. మన రూపాయల్లో ఒక్క అమెరికన్ డాలర్ విలువ రూ. 70.35.
♦10. కెనడా డాలర్: ఈ జాబితాలో పదోస్థానంలో కెనడా డాలర్ నిలిచింది. ప్రపంచ సంపద నిల్వల్లో ఐదో స్థానం ఆక్రమించే ఈ కరెన్సీని ముద్దుగా ‘లూనీ’ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో ఒక్క డాలర్ నాణెంపై ఓ పక్షి బొమ్మ ఉంటుంది. ఆ పక్షి గౌరవార్థం ఈ కరెన్సీని చాలామంది అలా పిలుస్తుంటారు. ప్రపంచ మార్కెట్లో ఒక్క కెనడా డాలర్ 0.75 అమెరికన్ డాలర్లకు సమానం. అంటే రూ. 52.23 అన్నమాట. ఇవి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కరెన్సీ కలిగిన దేశాలు. 👉ఇక మన భారతదేశం విషయానికొస్తే.. మన ఒక్క.రూపాయి 0.014 డాలర్లకు సమానం. అలాగే ఒక్క అమెరికన్ డాలరు విలువ మన 70.35రూపాయలు * ఇక నుండి కొత్తగా విదేశాలలో పనుల కోసం వెళ్ళే వారు..currency రేట్స్ చూసి మరీ బయలుదేరండి..