128.85 కోట్లకు భారతదేశ జనాభా!

Spread the love

Teluguwonders:

భారతదేశ జనాభా 128.85 కోట్లకు చేరుకుంది. జాతీయ జనాభా లెక్కల విభాగం తాజా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల విభాగం 2017లో చేపట్టిన గణాంకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ఏడాది వ్యవధిలో దేశంలో 1.45 కోట్ల మంది జనాభా పెరిగారు. కాలం తీరి వెళ్ళేవారు వెళ్ళిపోగా.. కొత్తగా పుడుతున్న శిశువులతో దేశంలో ఈ పెరుగుదల కనిపించింది. నిమిషానికి 49 మంది జన్మిస్తుంటే.. 15 మంది కన్నుమూస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గ్రామాల్లో కంటే శిశు జననాలు పట్టణాల్లో ఎక్కువగా ఉంటున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తెలంగాణలో 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ 6,17,620 మంది శిశువులు జన్మించారు. వీరిలో74.85 శాతం పట్టణాల్లోనే పుట్టారు. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లో మొత్తం జనాభా తక్కువగా ఉన్నా.. జననాలు మాత్రం పట్టణాల్లో ఎక్కువగా ఉండడం గమనార్హం. తెలంగాణ జిల్లాలవారీ లెక్కల్లో హైదరాబాద్, వరంగల్ అర్బన్, నిజామాబాద్‌లు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం 3.69 కోట్ల మంది ఉండగా, జనాభా పరంగా 12వ స్థానంలో నలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 5.23 కోట్ల మంది ఉండగా.. 10వ స్థానంలో ఉంది. అత్యల్పంగా సిక్కిం 6.56 లక్షల జనాభాతో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక ఎప్పటిలానే ఉత్తరప్రదేశ్ జనాభా విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 22.26 కోట్ల మంది ఉన్నారు. ఏపీలో నమోదైన జననాల్లో తూర్పు గోదావరి, కర్నూలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో అయితే.. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలు వరుస క్రమంలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి.

దేశంలో రాష్ట్రాల్లోని జనాభా వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 22,26,08,000, మహారాష్ట్ర 12,18,91,000, బీహార్ 10,54,52,000, పశ్చిమ బెంగాల్ 9,45,97,000, మధ్యప్రదేశ్ 7,93,31,000, రాజస్థాన్ 7,42,53,000, తమిళనాడు 6,98,42,000, గుజరాత్ 6,37,69,000, కర్ణాటక 6,30,92,000, ఆంధ్రప్రదేశ్ 5,23,20,000, ఒడిశా 4,29,18,000, తెలంగాణ 3,69,40,000.

ఇలా ఉండగా.. వయస్సు వారీగా మరణాలను విశ్లేషిస్తే.. తెలంగాణలో 65 నుంచి 69 ఏళ్ళ మధ్య ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇలా ఐదేళ్ళ కాలంలో తెలంగాణలో మొత్తం 34,278 మంది తుదిశ్వాస విడిచారు. ఇక ఏపీలో అయితే.. మరింత ముందుగా 54 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సున్నవారు ఎక్కువగా కన్నుమూశారు. అలా ఏపీలో 65,156 మంది పై లోకాలకు వెళ్ళిపోయారు. ఏపీలో ప్రతి పదేళ్ళ వారీగా లెక్కల్ని పరిశీలిస్తే.. ఇదే అత్యధికం. ఏపీలో 54 ఏళ్ళ నుంచి మరణించేవారి సంఖ్య పరుగుతూ వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *