*హిమ సునామీ

Spread the love

*మంచు ఫలకాలు విరిగిపడి పోటెత్తిన నీటి ప్రవాహం*

*ధౌలీగంగ నదికి ఆకస్మిక వరదలు*

*ఏడుగురి మృతి.. 170 మంది గల్లంతు* *దెబ్బతిన్న జల విద్యుత్కేంద్రాలు* *ఉత్తరాఖండ్‌లో దారుణం*

దేహ్రాదూన్‌ – దిల్లీ దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఆదివారం జలవిలయం సంభవించింది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటే ఎలాంటి విపత్తులు వస్తాయో కళ్లముందుంచింది. ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. కనీసం ఏడుగురు మరణించారు. ఏకంగా ఓ జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోగా.. మరొకదానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి ధౌలీగంగ నదిలో పడడంతో హఠాత్తుగా భారీ వరదలు సంభవించాయి. అలకనంద, ధౌలీగంగ, రుషి గంగ నదుల మధ్య ప్రాంతంలో ఈ విపత్తు చోటు చేసుకుంది.

రుషిగంగ నది ధౌలీగంగలో కలుస్తుంది. అనంతరం ఈ రెండూ కలిసి అలకనందలో కలుస్తాయి. ఇవన్నీ గంగానదికి ఉపనదులే. సున్నితమైన హిమాలయాల ఎగువ ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ధౌలీగంగలో సాధారణ నీటి మట్టానికి మించి మూడు మీటర్ల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున తపోవన్‌-రేణి వద్ద ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలోని తపోవన్‌-విష్ణుగద్‌ 480 మెగావాట్‌ల జలవిద్యుత్తు కేంద్రంలో కూడా నీరు ప్రవహించింది.

‘‘దీంతో అందులో పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు’’

అని రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. జలవిద్యుత్తు కేంద్రానికి సంబంధించిన సొరంగం పనులు చేస్తుండగా, అకస్మాత్తుగా దాంట్లోకి వరద నీరు ప్రవేశించింది.

వారంతా నీటిలో చిక్కుకున్నారు. 16 మంది కార్మికులను ఐటీబీపీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షించాయి. ఈలోగా చీకటి పడడంతో మిగిలిన వారిని రక్షించడం సాధ్యం కాలేదు. వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. సొరంగాల్లో 30, 40 అడుగుల ఎత్తులో మట్టి పూడుకుపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. జలవిద్యుత్తు కేంద్రంలో ఎంతమంది పనిచేస్తున్నారన్న దానిపై ఆ ప్రాజెక్టు అధికారులు స్పష్టమైన వివరాలు చెప్పకపోవడంతో గల్లంతయిన వారి సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయి. 250 మీటర్ల పొడవు ఉన్న ఆ సొరంగంలోకి జవాన్లు అతి కష్టం మీద 150 మీటర్ల వరకు వెళ్లగలిగారు. అయితే ఎవరి ఆచూకీ వారికి లభించలేదు. *కొట్టుకుపోయిన విద్యుత్కేంద్రం*

ధౌలిగంగ వరదల కారణంగా సమీపంలోని రుషిగంగ నదిలో కూడా నీటిప్రవాహం పెరగడంతో రేణి గ్రామం వద్ద దానిపై ఉన్న 12.3 మెగావాట్ల సామర్థ్యంగల చిన్న తరహా జలవిద్యుత్తు కేంద్రం నామరూపాలు లేకుండా పోయింది. ఈ గ్రామం వద్దే రుషిగంగ, ధౌలీ గంగ నదులు కలుస్తుంటాయి.

ఇక్కడి వంతెన కూడా కొట్టుకుపోయిందని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు. చైనా సరిహద్దుల్లోని బోర్డర్‌ పోస్టులకు వెళ్లేందుకు ఈ వంతెనే కీలకం. సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. జిల్లా కేంద్రం చమోలీకి కలిపే పక్కా రోడ్డు, నాలుగు సస్పెన్షన్‌ బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అలకనందలో నీటి ప్రవాహం ఒక మీటరు మేర పెరిగినా క్రమేణా శాంతించడంతో ముప్పు తప్పింది. పరిస్థితిని గమనించిన అధికారులు పౌరి, తెహ్రీ, రుద్రప్రయాగ్‌, హరిద్వార్‌, దేహ్రాదూన్‌ జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని గ్రామాల వారిని ఖాళీ చేయించారు. పరీవాహక ప్రాంతంలో ఎక్కడా వరదలు రాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ గంగానది ఒడ్డునగల జిల్లాల్లో అప్రమత్తత ప్రకటించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. *రంగంలోకి దిగిన దళాలు*

తొలుత ప్రమాదం గురించి తెలుసుకున్న జోషిమఠ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మంగళ్‌ సింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఉదయం 10.45 గంటల ప్రాంతంలో తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇది తెలుసుకొని జోషిమఠ్‌ సమీపంలో దేశ సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులు గంట వ్యవధిలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు అందించేందుకు వివిధ దళాలు రంగంలో దిగాయి. జాతీయ విపత్తు సత్వర స్పందన దళాని(ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కి చెందిన బృందాలు వచ్చాయి.

కొందరు తాళ్ల సహాయంతో కొండలు దిగి సహాయం అందించారు. దేహ్రాదూన్‌ నుంచి ఒక బృందం, దిల్లీ నుంచి నాలుగు బృందాలు వచ్చాయి. దిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ వైమానిక స్థావరం నుంచి మరో నాలుగు దళాలు విమానంలో, రోడ్డు మార్గంలో ఇంకో రెండు దళాలు వచ్చాయి. ఐటీబీపీకి చెందిన రెండు బృందాలు, రాష్ట్ర విపత్తు స్పందన (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) దళానికి చెందిన నాలుగు బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. సైన్యానికి చెందిన నాలుగు కాలమ్స్‌ జవాన్లు రంగ ప్రవేశం చేశారు.

ఒక్కో కాలమ్‌లో వంద మంది సైనికులు ఉన్నారు. అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌, రెండు చీతా హెలికాప్టర్లు సేవలు అందిస్తున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను తీసుకెళ్లడానికి సీ-130, ఎన్‌32 విమానాలను ఉపయోగించారు. నౌకాదళానికి చెందిన ఏడుగురు డైవర్లు కూడా వచ్చారు. సైన్యానికి చెందిన రెండు వైద్య బృందాలు, ఒక ఇంజినీరింగ్‌ బృందం సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎన్‌టీపీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, హిమానీనదాలను పర్యవేక్షించే డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు కూడా సంఘటన స్థలానికి వెళ్లారు. మొత్తంగా 600 మందికిపైగా సైనికులు సేవలు అందిస్తున్నారు.

*సహాయ చర్యలకు వాతావరణం అనుకూలం*

సోమవారం ప్రకృతి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని వాతావరణ విభాగం ప్రకటించింది. చిరుజల్లులు, మంచు తప్ప ఇతరత్రా ఆటంకాలు వచ్చే అవకాశం లేదని తెలిపింది. చమోలీ, తపోవన్‌, జోషిమఠ్‌ ప్రాంతాల్లో రెండు రోజులపాటు పొడి వాతావరణమే ఉంటుందని ఐఎండీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌ శర్మ చెప్పారు. దీంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురుకావని అధికారులు భావిస్తున్నారు. *దిల్లీలో కంట్రోల్‌ రూం ఏర్పాటు* సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. సంఘటన జరిగిన సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌తో మాట్లాడారు. అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ స్వీయ పర్యవేక్షణలో దిల్లీలో కంట్రోల్‌ రూం ఏర్పాటయింది. మహారాష్ట్రలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకి విషయం తెలియడంతో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి, ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ల డైరెక్టర్‌ జనరళ్లతో మాట్లాడారు. భారత వాయుసేనను అప్రమత్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా ఆధ్వర్యంలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. *మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం*

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షల వంతున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రావత్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *