అద్భుతం.. అంగారక దృశ్యం!

Spread the love

*విస్పష్ట ఫొటోలను పంపిన ‘పర్సెవరెన్స్‌’* *తొలిసారిగా ల్యాండింగ్‌ చిత్రం*

కేప్‌ కెనావెరాల్‌: అంగారకుడిపై దిగిన అమెరికా వ్యోమనౌక ‘పర్సెవరెన్స్‌’ తాజాగా అద్భుతమైన ఫొటోలను పంపింది. ల్యాండింగ్‌కు సంబంధించిన సంక్లిష్ట ప్రక్రియను తొలిసారిగా అత్యంత సమీపం నుంచి క్లిక్‌మనిపించింది. పర్సెవరెన్స్‌ రోవర్‌ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. వాటిలోని పలు కెమెరాలను ల్యాండింగ్‌ సమయంలోనే ఇంజినీర్లు ఆన్‌ చేశారు. రాకెట్లతో నడిచే స్కై క్రేన్‌ యంత్రం..

తాళ్ల సాయంతో రోవర్‌ను అంగారక ఉపరితలంపై సాఫీగా దించింది. దానికి ముందు నేల నుంచి రెండు మీటర్ల ఎత్తులో తాళ్లకు వేలాడుతున్న రోవర్‌ దృశ్యం కనువిందు చేస్తోంది. రాకెట్ల నుంచి వెలువడిన జ్వాలల తాకిడికి పైకి ఎగిసిన ఎర్రటి అంగారక ధూళి కూడా అందులో కనిపించింది. రానున్న కొద్దిరోజుల్లో ల్యాండింగ్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లను వెలువరిస్తామని నాసా తెలిపింది. మరో ఫొటోలో రోవర్‌ చక్రం, రంధ్రాలమయంగా ఉన్న కొన్ని రాళ్లు కనిపించాయి.

భవిష్యత్‌లో ఆ రాళ్ల నమూనాలను పర్సెవరెన్స్‌ సేకరించి, భూమికి పంపుతుంది. రోవర్‌ దిగిన చదునైన ప్రాంతానికి సంబంధించిన ఫొటో కూడా నాసా చేతికి అందింది.

*రెండు కిలోమీటర్ల దూరంలో..*

నిర్దేశిత రీతిలో అంగారకుడి ఉపరితలంపైనున్న జెజెరో బిలంలోని సురక్షితమైన ప్రాంతంలోనే పర్సెవరెన్స్‌ దిగిందని నాసా అధికారులు పేర్కొన్నారు. రోవర్‌లో స్వల్పంగా 1 డిగ్రీ ఒరుగుదల మాత్రమే ఉందన్నారు.

దగ్గర్లో చిన్నచిన్న రాళ్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. రోవర్‌లోని అన్ని వ్యవస్థలూ సక్రమంగానే ఉన్నాయని తెలిపారు. రోవర్‌ ముందుకు కదలడానికి కనీసం ఒక వారం సమయం పడుతుందన్నారు. అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది నిర్ధరించడానికి నాసా ఈ రోవర్‌ను పంపిన సంగతి తెలిసిందే.

జెజెరో బిలంలోని ఒక భాగంలో వందల కోట్ల ఏళ్ల కిందట నది డెల్టా ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ పురాతన జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండొచ్చని అంచనా. ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పర్సెవరెన్స్‌ దిగిందని నాసా తెలిపింది. అంగారకుడి కక్ష్యలో ఉన్న మార్స్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ కూడా పర్సెవరెన్స్‌ ల్యాండింగ్‌ దృశ్యాలను తన కెమెరాలో బంధించింది. ఎగువ వాతావరణంలో రోవర్‌ పారాచూట్‌ విచ్చుకోవడం అందులో కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *