మంచుకొండల్లో కలవరం.. ముందే గుర్తించే పరికరం

Spread the love

*భూకంపలేఖినిలతో ముందస్తు హెచ్చరికలు*

*ఉత్పాతాలపై అత్యంత కచ్చితత్వంతో సమాచారం*

*దేశంలోనే తొలిసారి అభివృద్ధి చేసిన ఎన్‌జీఆర్‌ఐ*

*‘ఈనాడు’తో సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పూర్ణచంద్రరావు*

హైదరాబాద్‌: హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. భూతాపంతో మంచు కొండలు కరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో శిఖరాలపై మంచు కరిగి హఠాత్తుగా వరదలు పోటెత్తడంతో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రెండు మూడేళ్లకు ఇలాంటి ఉత్పాతాలు హిమాలయాల్లో సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో తరచూ భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. ఇలాంటి ముప్పును భూకంపలేఖినిల సాయంతో ముందే గుర్తించే వ్యవస్థను తొలిసారి అభివృద్ధి చేశామని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.పూర్ణచంద్రరావు ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు. *హిమాలయాల్లో ఎలాంటి విపత్తులు పొంచి ఉన్నాయి?* హిమాలయాలకు భూకంపాలే కాదు.. కొండ చరియలు విరిగిపడడం, మంచు ఫలకాలు కరిగి వరదలు రావడం, పర్వతాలపై మంచు చెరువుల్లా ఏర్పడి భూతాపంతో హఠాత్తుగా కరిగి విరుచుకుపడడం వంటి విపత్తులు అనేకం పొంచి ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ప్రమాదం దీనికో ఉదాహరణ. 5600 మీటర్ల ఎత్తులో కొండపైన ఉన్న రాళ్లు కిందపడ్డాయి..వాటితో పాటు మంచు కరిగి కింద ఉన్న రిషిగంగలోకి వరద పోటెత్తింది. ఏప్రిల్‌ 23న మంచు చరియలు విరిగిపడి 11 మందివరకు చనిపోయారు. వాతావరణ మార్పులు, భూతాపంతో హిమాలయాలకు ముప్పు పెరిగింది. *విపత్తుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపగ్రహ వ్యవస్థ ఎలా ఉపయోగపడుతోంది?*

హిమాలయాల్లో విపత్తులకు సంబంధించి శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఇప్పటివరకు సమాచారం సేకరిస్తున్నాం. అంతా జరిగిపోయాక అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు మాత్రమే ఈ చిత్రాలు ఉపయోగపడుతున్నాయి. పైగా ఉపగ్రహం నుంచి ఒక చిత్రం పంపిన తర్వాత మరోటి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమాచారం వచ్చేలోపే కొన్నిసార్లు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సమాచార అంతరం ఇక్కడ పెద్ద అగాధంగా ఉంది. రియల్‌ టైమ్‌ పర్యవేక్షణ ఉండడం లేదు. *భూకంపలేఖినిల సాయంతో కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?*

హిమాలయాల్లో ఎన్‌జీఆర్‌ఐ కొన్ని సంవత్సరాల క్రితం వేర్వేరు ప్రాంతాల్లో 80 భూకంప లేఖినులను ఏర్పాటుచేసింది. ఇది చాలా విస్తృతమైన నెట్‌వర్క్‌ అని చెప్పాలి. భూకంప లేఖినిలో చిన్న శబ్ధం కూడా రికార్డవుతుంది. పైగా సెకన్ల వ్యవధిలోనే ఆ విషయం పర్యవేక్షణ కేంద్రానికి చేరుతుంది. సెకనుకు మూడు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో సమాచారం అందుతుంది. కొండ చరియలు, మంచు ఫలకాలు విరిగినప్పుడు కూడా శబ్దాలు రికార్డవడం గమనించాం. అంత ఎత్తు నుంచి మంచు చరియలు విరిగి వరద నదిలో కలిసేందుకు అరగంట సమయం పడుతుంది. ఈలోగా అక్కడ యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తే ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవచ్చు. *ఈ విధానంలో సవాళ్లను ఎలా అధిగమించారు?*

పెద్ద శబ్ధాలతో వచ్చే భూకంపాలను లేఖినిలో సులువుగా గుర్తించవచ్చు. సిగ్నళ్ల ఆధారంగా గుర్తించడం తేలిక. అయితే వీటిలో ట్రాఫిక్‌, వర్షం కురిసిన శబ్ధాలు కూడా రికార్డవుతాయి. ప్రత్యేకించి కొండచరియలు విరిగినప్పుడు వచ్చే శబ్ధాలను గుర్తించడం ఒక కేంద్రంలో అయితే కష్టం. అక్కడ ఉన్న వివిధ భూకంపలేఖినిల్లో ఒకే విధమైన శబ్ధాలు రికార్డు అయినప్పుడు వాటిని గుర్తుపట్టడం సాధ్యమవుతుంది. వీటిని సైతం సులువుగా గుర్తించేందుకు మా బృందం ఒక కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఒక సెకనులో వందోవంతు కచ్చితత్వం సాధ్యమైంది. ఫలితంగా సులువుగా ట్రాక్‌ చేయవచ్చు. *ఇప్పటికే ఉన్న భూకంపలేఖినిలు సరిపోతాయా? మరిన్ని ఏర్పాటు చేయాలా?*

ఇప్పుడు ఉన్నవాటి సంఖ్య చాలా ఎక్కువే. ఇవి సరిపోతాయి. కొన్నిచోట్ల వాటి స్థానాలను మార్పులు చేయాల్సి ఉంటుంది. భూకంపలేఖిని సాయంతో మందస్తు హెచ్చరికల వ్యవస్థను అభివృద్ధి చేయడం దేశంలోనే ఇది మొదటిది. ప్రపంచంలో వేర్వేరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహా సమాచార సేకరణలో అనుభవం ఉన్న జర్మనీతోనూ మనం కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడా ఆచరణలోకి రాలేదు. మనది అందుబాటులోకి వచ్చి సమాచారం పక్కాగా అందితే ప్రపంచంలోనే మొదటిది అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *