అక్షయ తృతీయ ..ఒక బంగారం లాంటి పండగ..

Spread the love

వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. 🔅అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనే పండగనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తూన్నా ఎన్నో ప్రత్యేకతలు దీని సొంతం.శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహారి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే.

👉ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని భక్తుల నమ్మకం. అయితే, ఈ రోజు చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలానిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఈ శుభ తిథిన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుంది. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. ఈ తిథి రోజు మొత్తం శుభకార్యాలను జరపించుకోవచ్చు.
🔅పురాణాల్లో దీని విశిష్టత : త్రేతాయుగం మొదలైంది, విష్ణు స్వరూపుడయిన పరశురాముడు జన్మించిందీ కూడా ఈ రోజే. శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడి జననం, అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు ఇదే. కురు సభలో తనకు జరుగుతోన్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదికి దేవదేవుడు అక్షయంగా చీరలు ఇచ్చిందీ ఈ రోజే. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించిందీ, శివుని జటాజూటం నుంచీ భూలోకానికి గంగ చేరింది కూడా ఈ సుదినమే.
సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం కూడా అక్షయ తృతీయ నాడు మాత్రమే లభిస్తుంది. ఏడాదంతా చందనపు పూతతో స్వామి కప్పిఉంటారు. చార్‌దామ్ యాత్రలో ముఖ్యమైన బదరీనాథ్‌ ఆలయాన్ని చలికాలం తర్వాత తిరిగి తెరిచేది అక్షయ తృతీయ నాడే. శ్రీక్షేత్రం పూరిలో జగన్నాథుడి రథ నిర్మాణానికి కూడా అంకురార్పణం జరిగే రోజు.
🔅ఆరోజు తప్పకుండా చెయ్యవలసిన పనులు: అనంత ఫలితాలనొసగే మహావిష్ణువే ఈ వ్రతానికి అధినాయకుడు. కాబట్టి ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించాలి. పూజలోని అక్షితలు తలమీద వేసుకుని, శక్తిమేర దానధర్మాలు చేయాలి. కొందరు ఈ రోజు ‘వైశాఖ పూజ’ చేస్తారు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు, గంధం దానం చేస్తారు. ఎండలు మండిపోయే వైశాఖంలోని ఈ పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరచినా, ఎవరికైనా కాస్త దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారికి పుణ్యలోకం ప్రాప్తిస్తుంది.

ఇలా ఆక్షయ తృతీయ అనేది అనేక విశేషాల సమాహారం..బంగారం లాంటి విలువైన పండుగ


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading