ఎన్నికలకు ముందు తమ పార్టీ మ్యానిఫెస్టోలో వైసీపీ అధినేత జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బహిరంగంగా పలు వేదికలలో ప్రకటించారు .ఇవన్నీ మామూలే అనుకుని అప్పట్లో ఆర్టీసీ కార్మికులు కూడా అంతగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఆశ్చర్యం గా ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తో సానుకూల దిశగా అడుగులు వేయటం కార్మికులలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉద్యోగులకు సంబంధించి వారి భద్రత, వేతనాల పెంపుదల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పన్నెండు వేల మందికి పైగా రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కార్మికుల్లో విలీన ఆశలు నెలకొన్నాయి. దాంతో రాజధాని ప్రాంత జిల్లాల ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనంపై ఆశలు పెట్టుకుంటున్నారు.
🔴విలీనం వల్ల లాభాలు :
ఆర్టీసీ కనుక ప్రభుత్వంలో విలీనమైతే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కలుగుతుంది. ఏటా ఫిట్‌మెంట్ కోసం సమ్మెలు చేయాల్సిన అవసరం లేదు.
సంస్థలోకి అద్దె బస్సులను తీసుకునే అవసరం ఉండదు. కొత్త బస్సులను కొనుగోలు చేయటానికి బడ్జెట్‌ను కేటాయిస్తారు. లాభ, నష్టాల ప్రాతిపదికన చూసే అవసరం ఉండదు. దీంతో ప్రయాణికుల ఆదరాభిమానాలతో సంబంధం లేకుండానే అన్ని ప్రాంతాలకు బస్ కనెక్టివిటీ ఏర్పడుతోంది.
డీజిల్ ధరలతో సంబంధం లేకుండా ప్రజలకు రాయితీ ప్రయాణం అందించటానికి దోహదపడుతుంది. ఆర్టీసీకి నష్టాలు వస్తే అది ప్రభుత్వమే భరిస్తుంది. లాభాలు వస్తే అది ప్రభుత్వానికే చెందుతుంది. ఆర్టీసీ అప్పుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.
ఆర్టీసీ భవనాలు, కాంప్లెక్స్‌లు, బస్‌స్టేషన్‌లు, డిపోలు, గ్యారేజీలు అన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. అన్నింటికంటే ముందుగా సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
🔸విలీనం చేస్తే ఒక శుభ పరిణామమే :
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తే నిజంగా ఒక శుభ పరిణామమే. ప్రభుత్వం రవాణా వ్యవస్థను కూడా విద్య, వైద్యం, సేవలు తదితర సంక్షేమ శాఖల తరహాలోనే ఒక సంక్షేమంగా నిర్వహించటానికి ఉపయో గపడుతుంది. ఇప్పటివరకు లాభనష్టాల ప్రాతిపదికన చూడటం వల్ల.. ఆర్టీసీ రానురానూ వ్యాపారధోరణితో వ్యవహరించాల్సి వస్తోంది.
దీంతో యాజమాన్యాలు, కార్మికుల మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతోంది. ప్రస్తుతం కార్మిక సంఘాలన్నీ గంపగుత్తగా ఆర్టీసీ యాజమాన్యం వైఖరిపైనే సమ్మె అస్ర్తాలను ప్రయోగించాయి. ఆర్టీసీ చరిత్రలో యాజమాన్యం వైఖరిపై మూకుమ్మడిగా సమ్మె నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి. గతంలో ప్రభుత్వ విధానాలను నిరశిస్తూ కార్మిక సంఘాలు సమ్మె అస్ర్తాలను ప్రయోగించేవి. దీనికి భిన్నంగా ఈసారి యాజమాన్య విధానాలపై సమ్మె అస్ర్తాలను ప్రయోగించటం గమనార్హం.
🔴ఆర్టీసీ సంక్షోభానికి కారణం :
ఆర్టీసీలో బస్సులు కుదింపు, తద్వారా కార్మికులను తగ్గించేయటం, అవసరాలకనుగుణంగా పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకు రావటం, సంస్థలో కొత్త బస్సులను ప్రవేశపెట్టకుండా అద్దె బస్సులను తీసుకోవటం, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు తిప్పటం వల్ల నష్టాలు వస్తున్నాయని వాటిని ఆపివేయటం, కేవలం లాభాలు వచ్చే దూర ప్రాంతాలకే అత్యాధునిక బస్సులు ప్రవేశపెట్టడం, కొత్త బస్సులు కొనలేక కాలం తీరిన బస్సులనే రోడ్ల మీద పరుగులు తీయించటం వంటివి ఆర్టీసీ యాజమాన్యం నిరాఘాటంగా కొనసాగిస్తోంది. ఈ విధానాల వల్ల ఆర్టీసీ అనే వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోతోందని కార్మిక సంఘాలు ఆందోళన సాగిస్తున్నాయి.
ఇలాంటి పరిస్తితుల్లో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే ఆర్టీసీ కార్మికులకు పండుగే మరి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.