గంజాయి స్మగ్లర్లు ఇక తప్పించుకోలేరు!

Cannabis smugglers can no longer escape!
Spread the love

Teluguwonders:

గంజాయి స్మగ్లర్ల పనిపట్టేందుకు.. కొత్త పంథాను ఎంచుకున్నారు విశాఖ జిల్లా పోలీసులు. అక్రమ రవాణాకు చెక్ పట్టేందుకు.. నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసు జాగిలాలు మత్తుపదార్థాల గుట్టును రట్టు చేస్తున్నాయి.

దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా.. దాని మూలాలు విశాఖ మన్యంలోనే బయటపడటం కలవరం రేపుతుంది. ఇక్కడి అడవుల్లో పండే గంజాయికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉండటంతో.. స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో భారీగా ఆదాయం వస్తుండటంతో స్మగ్లర్లు మరింత దూకుడు పెంచారు. పర్యాటకులు, ప్రయాణీకులు, విద్యార్ధుల రూపంలో మత్తు పంటను అక్రమ రవాణా చేస్తున్నారు.

పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఎన్ని విధాలుగా నిఘా పెట్టినా.. స్మగ్లర్ల దూకుడు మాత్రం అరికట్టలేకపోతున్నారు. కూరగాయలు, మొక్కలు, నిత్యావసరాల మాటున టన్నుల కొద్దీ గంజాయి సరిహద్దులు దాటిపోతోంది.

నిఘా అధికమైన ప్రతీసారీ… తనిఖీలకు చిక్కకుండా స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. గతంలో మాదిరిగా బస్తాల్లో కాకుండా… రెండేసి కిలోల చొప్పున ప్యాకెట్లు కట్టి, వాటికి పేపర్లు చుట్టి, ప్లాస్టర్‌తో పటిష్టంగా ప్యాకింగ్‌ చేస్తున్నారు. లారీలు, వ్యాన్ల అడుగు భాగాన, క్యాబిన్ ల వెనుక, ఛాసిస్‌పైన, సీట్ల అడుగున… ఇలా పలు చోట్ల ప్రత్యేకంగా అరలు తయారు చేయించి, గంజాయి ప్యాకెట్లను వాటిలో ఉంచి తరలిస్తున్నారు. పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహించినా… ఈ ప్రత్యేక ఏర్పాట్లతో అవి కాస్తా కనిపించట్లేదు. ఇక ప్రయాణికుల రూపంలో బస్సులు, కార్లు, జీపుల్లో సూట్‌కేసులు, బ్యాగుల్లో గంజాయిని రవాణా చేస్తూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

స్మగ్లర్లు ఇలా కొత్త తరహాలో స్మగ్లింగ్ చేయడంతో పోలీసులకు వారిని పట్టుకోవడం అన్ని సందర్భాల్లో సాధ్యం కావడంలేదు. అందుకే ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దించుతున్నారు. మత్తు పదార్థాలు ఎక్కడున్నా.. వాటిని పసిగట్టేలా.. ఈ ప్రత్యేక జాగిలాలకు శిక్షణ ఇచ్చారు. ఇవి మత్తు పదార్థాన్ని సులువుగా పట్టుకుంటున్నాయి. తాజాగా పాడేరు నుంచి విశాఖపట్టణం వెళ్తున్న బస్సును తనిఖీ చేయగా మూడు బ్యాగుల్లో సుమారు 34 కేజీల గంజాయిని పసిగట్టాయి ఈ జాగిలాలు. దీంతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ మహిళ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మీద పాడేరు ప్రాంతం నుంచి పలు వాహనాల్లో గంజాయిని రవాణా చేస్తున్న స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నాయి ఈ జాగిలాలు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading