భక్త శబరి గురించి మీకు తెలుసా..!!?

Spread the love

Teluguwonders:

శబరి బోయకులంలో పుట్టింది. పంపానది తీరానవున్న మతంగ మహాముని ఆశ్రమంలో పెరిగింది. ముని కన్యల సాంగత్యం ఆమెకు లభించింది. సహజమైన అమాయకత్వంతో ఉండేది. మాతంగ ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది. మతంగ మహామునిని పరమేశ్వరుడిగా భావించి సేవించేది. ఆశ్రమాన్ని తుడిచి శుభ్రం చేసేది. ఆవులకు మేత పెట్టేది. పూజకు కావలసిన పూలు, పళ్ళు, సమిధులు ఏరి తెచ్చేది. మునులు చెప్పే భక్తి మాటలు వినేది. సేవే మార్గంగా బతికేది.

🕉రాముడు వస్తాడని :

ఆశ్రమంలోనే మునుల మాటల్లో రాముని గురించి విన్నది, విష్ణుమూర్తి అవతారమని గ్రహించింది. రాక్షస సంహారం చేసే వీరుడని తెలుసుకుంది. సీతా లక్ష్మణ సమేతుడై రాముడు వస్తున్నాడని తెలిసి అతణ్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశ ని మతంగ మహర్షి రాముని గురించి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ని చూస్తే చాలనుకుంది. అంతకుమించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది. . మతంగ ముని ముసలి వాడై పోయాడు. తను స్వర్గానికి వెళుతూ కూడా రాముడు వస్తాడనీ చెప్పాడు. దర్శనమిస్తాడనే చెప్పాడు. ఆశ్రమాన్ని అంటి పెట్టుకొనే ఉండమన్నాడు. ఎప్పటికయినా రాముడు వస్తాడని శబరి మనసా వాచా నమ్మింది.

శబరి ఆశ్రమంలో ఒంటిగానే మిగిలింది. లేదు, ఆమెకు రాముడు తోడున్నాడు. రామనామమే శబరికి సర్వమూ అయింది. శబరికే ముసలి తనం వచ్చింది. రాముడు రాలేదు. వస్తాడనే ఆమె నమ్మకం. ఒంట్లో శక్తే కాదు, కంటిచూపూ తగ్గింది. రాముని మీద నమ్మకం తగ్గలేదు. గురువుగారి మాట మీద గురి పోలేదు. అందుకే వేకువ ఝామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్ళు తెచ్చేది. పూలు పళ్ళూ తెచ్చేది. పూలను మాలకట్టేది. అలంకరించేది. పళ్ళను ఫలహారంగా రాముడొస్తే పెట్టడానికి సిద్ధంగా ఉంచేది. ఆ రోజు రాముడొస్తున్నట్టు ఏ రోజుకారోజే ఎంతో ఎదురు చూసేది. రోజులూ నెలలూ సంవత్సరాలూ విసుగూ విరామం లేకుండా ఎదురు చూపులతోనే గడిపింది శబరి.

🕉 అదిగో శ్రీ రాముడు:

శబరి గురించి కబంధుడు రామునికి చెప్పాడు. రాముడు లక్ష్మణునితో శబరిని చూడవచ్చాడు. కానరాని కళ్ళని పులుముకొని చూసింది శబరి. రాముని రూపాన్ని మందగించిన కళ్ళు చూడకపోతేనేం ఒళ్ళంతా కళ్ళయినట్టు… చేతులతో తడిమింది. 🕉సేవలు చేసింది : ఆరాటంలో అడుగు తడబడినా మాట తడబడలేదు. “రామ రామ” అని ఆత్మీయంగా పిలిచి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకుంది. పూలు చల్లింది. అప్పటికే ఏరి దాచి ఉంచిన రేగుపళ్ళను తెచ్చియిచ్చింది. కసురుగా ఉంటాయేమోనని కలవరపడింది. కొరికి రుచి చూసి ఇచ్చింది. రాముడూ అంతే ఎంగిలి అనకుండా ఇష్టంగా తిన్నాడు. శబరి ఆత్మీయతకి ఆరాధనకి రాముడు ముగ్దుడైపోయాడు. అమ్మమ్మ దగ్గర మనవడిలాగ! జీవితమంతా ఎదురుచూపులతో గడిపేసిన శబరికి ఇంకో జన్మలేకుండా గురుదేవులు వెళ్ళిన లోకాలకు వెళ్ళేలా వరం ఇచ్చాడు. రాముని రూపం కళ్ళలో నిలుపుకొని పులకించి పునీతమయింది శబరి!.

🕎శబరి పూర్వ జన్మ : ఈమె చిత్ర కవచుడు గంధర్వరాజు కుమార్తె, పేరు మాలిని, వీటి
హోత్రుడనే పండితుడు వివాహ మాడాడు. ఇతడెప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి ధ్యానిస్తుంటేఇతని భార్య మాలిని (శబరి)కల్మషుడనే వేటగాళ్లి ప్రేమించింది. అది గమనించిన వీటిహోత్రుడామెను వేటగాడిని ప్రేమించావు గనుక ఆటవికురాలివి కమ్మని శపించాడు.

మాతంగాశ్రమం వద్ద జీవనం : మాలిని కన్నీటి ఈ శాపం నుండి విముక్తి కోరగా శ్రీరాముడుదర్శనంతో విముక్తి కలుగుతుందని భర్త శాపవిమోచనం
చెప్పాడు. వెంటనే ఆమె ఆటవిక కన్యగా మారి మాతంగాశ్రమ ప్రాంతానికి వచ్చి జీవించ సాగింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading