Teluguwonders:
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురువారం(ఆగస్టు 22,2019) కలెక్టరేట్‌లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల టైమింగ్స్ వివరించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల మధ్య ప్రతీ రోజూ రెండు పరీక్షలు ఉంటాయన్నారు.
అనంతపురం జిల్లాలో 881 గ్రామ, 300 వార్డు సచివాలయాల్లో 9వేల 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
19 రకాల పోస్టుల కోసం 2లక్షల వెయ్యి 886 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు 444 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చెప్పారు. అభ్యర్థులు ఆగస్టు 25 అర్ధరాత్రి నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. హాల్ టిక్కెట్‌లో ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేసి సరి చేసుకోవచ్చని సూచించారు. లేదంటే వైట్ పేపర్ పై హాల్ టిక్కెట్‌లో ఉండే వివరాలు రాసుకొని 3 ఫొటోలు తీసుకొని వాటిపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకొని తీసుకొని రావొచ్చన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే పరీక్షల్లో మొదటి రోజు నిర్వహించే పరీక్షే కీలకం. ఈ పరీక్షకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 44 మండలాల్లో 444 కేంద్రాల్లో 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఓఎంఆర్ షీటులోని కార్బన్ పేపర్‌ను అభ్యర్థులకే ఇస్తామన్నారు. పరీక్షలు ముగిశాక అన్సర్ షీట్లు, ఓఎంఆర్ షీట్లను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో ఉంచనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 26వేల 728 గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. వీటి కోసం 21 లక్షల 69వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ)లకు ప్రభుత్వం అప్పగించింది. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీలోపు ఈ నియామక ప్రక్రియ ముగియనుంది. 13 జిల్లాల పరిధిలో 6వేల 163 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.