Teluguwonders:
ముంబయి:
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. ఎంఎస్ ధోనీ వీడ్కోలు గురించి అతడు చెప్పకనే చెబుతున్నాడా? లేక ఊరికే చేశాడా? అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్‌లోని ఓ సన్నివేశాన్ని కోహ్లీ పోస్ట్ చేశాడు. దానికి ‘నేను ఎన్నటికీ మరిచిపోని మ్యాచ్ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిట్‌నెస్ పరీక్షలో పరుగెత్తించినట్టు ఈ వ్యక్తి (ధోనీ) నన్ను ఉరుకులు పెట్టించాడు’ అని ఆసక్తికర వ్యాఖ్య పెట్టాడు. తర్వాతి దశకు అర్హత సాధించాలంటే సూపర్-10లో ఆసీస్‌పై భారత్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అది.
విరాట్ కోహ్లీ కరీబియన్ పర్యటన నుంచి ప్రతిరోజూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. సముద్ర తీరాల్లో తన ప్రియసఖి అనుష్క శర్మతో విహరించిన దృశ్యాలు, చిత్రాలు అభిమానులతో పంచుకుంటున్నాడు. ప్రస్తుతం ధోనీ గురించి మాట్లాడాల్సిన సందర్భాలేమీ లేవు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడు ఎంపికవ్వలేదు. టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా ఏడాది సమయం ఉంది. మరి ఇప్పుడే కోహ్లీ ఎందుకు ట్వీట్ చేశాడని ప్రస్తుతం మహీ అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. కొంపదీసి మాజీ సారథి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం గురించి పరోక్షంగా సూచన చేస్తున్నాడా? లేక ధోనీయే టీమిండియా, సెలక్టర్లకు ఇప్పటికే అందుకు సంబంధించిన సంగతి ఏమైనా చెప్పాడా? అని ప్రశ్నిస్తున్నారు.
కోహ్లీ పోస్ట్ చేసిన చిత్రానికి సంబంధించిన మ్యాచ్‌లో భారత్ 161 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగింది. 7.4 ఓవర్లకు 49/3తో నిలిచి కష్టాల్లో పడింది. యువీతో కలిసి నాలుగో వికెట్‌కు కోహ్లీ 45 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 14వ ఓవర్లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో యువీ ఇచ్చిన క్యాచ్‌ను షేన్ వాట్సన్ అందుకున్నాడు. ఆ తర్వాత ధోనీతో కలిసి విరాట్ 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కంగారూ బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు సంధించడంతో వీరిద్దరూ వికెట్ల మధ్యలో సింగిల్స్, డబుల్స్ తీసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆఖరి ఓవర్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి బంతికి ధోనీ బౌండరీ బాదాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.