హైదరాబాద్ నగర శివారులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన ప్రేమికులు అడ్డదారులు తొక్కి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
వాళ్ళిద్దరూ ప్రేమికులు. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేస్తారు. రోజూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. రోజూ బయటి తిరిగాలంటే డబ్బులు కావాలి. ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశలో దొంగతనాలకు అలవాటు పడ్డారు. కాలం కలిసొచ్చినంత కాలం జనాల నుంచి బాగానే దోచుకున్నారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
మేడిపల్లిలో నివసించే భాను ప్రకాష్ జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన మానస అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి పార్కులు, సినిమాలకు తిరిగేవారు. జల్సాలకు అలవాటు పడిన వీరిద్దరు డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. పెప్పర్ స్ప్రే సహాయంతో దోపిడీలు చేయాలని ప్లాన్ చేశారు. పెప్పర్ స్ప్రే తో దాడి చేసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కొన్ని పెప్పర్ స్ప్రేలు కొనుగోలు చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని స్పే జల్లి దొంగతనాలకు పాల్పడేవారు.
ఈ విధంగా మేడిపల్లి ప్రాంతంతో పాటు ఘట్‌కేసర్, కూకట్‌పల్లి, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. కొంతకాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ పెప్పర్ స్ప్రే లవర్స్‌ను చివరకు రాచకొండ పోలీసులు పట్టుకోగలిగారు. మేడిపల్లి ప్రాంతంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజీలో ఈ ప్రేమ జంట విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. దీంతో పోలీసులు నాలుగు ప్రాంతాలుగా ఏర్పడి భానుప్రకాష్, మానసను అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.