పుస్తకాలను చదువుతుంటే అతడు మాత్రం కంప్యూటర్లను చదివాడు. అతడికి కంప్యూటర్లంటే ప్రాణం.అదే జీవితమనుకున్నాడు.అందుకు కృతజ్ఞతగా ఆ కంప్యూటర్స్ 10th క్లాస్ చదివిన ఈ కుర్రాన్ని అవలాన్స్ గ్లోబల్ సోల్యూషన్స్’ సంస్థకు సృష్టికర్తను చేశాయి. అవును అతడు టెన్త్ క్లాస్ తోనే స్కూలుకు స్వస్తి చెప్పాడు. కట్ చేస్తే… ఇప్పుడతడు భారత్‌లోని టాప్-10 ‘ఎథికల్ హ్యాకర్స్’లో ఒకడయ్యాడు. మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ప్రపంచ టాప్-100లోనూ స్థానం సంపాదించాడు. బాలీవుడ్ సినిమాలను పైరసీ బారి నుంచి కాపాడుతున్న ఘనుడు. సైబర్ నేరాల మిస్టరీ ఛేదిచేందుకు పోలీసులకూ, నిఘా వర్గాలకూ తోడ్పడుతున్నాడు. 🔸”లక్ష్యాలు అందరికీ ఉంటాయి. కానీ మార్కులు, కెరీర్ రేస్‌లో పరుగెత్తడం వల్ల మనకు తెలియకుండానే ఆ లక్ష్యానికి దూరంగా వెళ్లిపోతున్నాం. అలా కాకుండా మనపై మనం నమ్మకంతో శ్రమిస్తే ఏ గోల్ అయినా కొట్టగలం” అంటున్నాడీ 25 ఏళ్ల హ్యాకింగ్ జీనియస్ మనన్ షా .ఆయన గురించి ఆయన మాటల్లోనే…విందాం..
🔴కంప్యూటరే..నా కెరీర్ :
మాది గుజరాత్‌లోని వడోదరా పట్టణం .చిన్నప్పటి నుంచీ కంప్యూటర్లంటే తగని మోజు. ఆ మోజుతో టెన్త్‌లోనే స్కూల్ వదిలేశాను. అప్పటి నుంచి కంప్యూటర్లతో కుస్తీ మొదలైంది. అదే నా లోకం అయిపోయింది.అందరూ కెరీర్ కోసం చదువుతారు. నేను…అదే కెరీర్ కోసం చదువు మానేశాను. అమ్మా నాన్నలు కూడా నా అభిరుచికి అడ్డు చెప్పలేదు.
🔸తొలి అడుగు :
స్కూల్ మానేసిన తరువాత కంప్యూటర్ కొనుక్కున్నాను. అదే నా తొలి కంప్యూటర్. సాఫ్ట్‌వేర్ డెవలపింగ్, ప్రోగ్రామింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టా. దాంతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్ కావాలని తీవ్రంగా శ్రమించా. అలా నాకు నేనుగా నేర్చుకుంటూ, నెట్‌లో కొత్త విషయాలు తెలుసుకున్నా ఆ క్రమంలోనే విభిన్నమైన అప్లికేషన్లు రూపొందించాను. 9 వెర్షన్లలో డెవలప్ చేసిన ‘బ్లాక్ ఎక్స్‌పీ’ 20 మిలియన్ డౌన్‌లోడ్స్ దాటింది. వీటితోపాటు వివిధ వెబ్‌సైట్స్, బ్లాగుల్లో రివ్యూలు రాశాను. అదే సమయంలో నా అధ్యయనమూ ఆగలేదు.
🔴రాత్రింబవళ్లూ …కంప్యూటర్‌తోనే :
ఒక్కొక్కటీ నేర్చుకుంటూ వెళుతుంటే ఇంకా ఏదో చేయాలన్న తపన నాలో పెరుగుతూపోయింది. మరో ధ్యాస లేకుండా రాత్రింబవళ్లూ కంప్యూటర్‌తోనే కుస్తీ పట్టేవాణ్ణి. లోతుకు వెళ్లిన కొద్దీ ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ క్రమంలో 2009లో వడోదరాలో ఎథికల్ హ్యాకింగ్‌పై జరిగిన సెమినార్‌కు వెళ్లాను. దీంతో హ్యాకింగ్‌పై ఆసక్తి పెరిగింది. ఎథికల్ హ్యాకర్‌ను అవ్వాలని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నా. అది మొదలు నా ఆలోచనలన్నీ హ్యాకింగ్, క్రాకింగ్ చుట్టూనే తిరిగాయి. ఏడాది తిరిగే లోపే దానిపై పూర్తి అవగాహన వచ్చింది. నైపుణ్యం సంపాదించాను. ‘ఎథికల్ హ్యాకర్’గా మంచి పేరొచ్చింది. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్‌లపై ఆరు పుస్తకాలు రాశాను. ఫేస్‌బుక్, ట్విట్టర్, స్కైప్,గూగుల్, యాహూ, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎడోబ్, శామ్‌సంగ్ తదితర వెబ్ అప్లికేషన్స్ అన్నింటిలో బగ్స్ గుర్తించి, రిపోర్ట్ చేశాను.
🔴అవలాన్స్ గ్లోబల్ సోల్యూషన్స్’ సంస్థ మొదలు :
ఇన్నేళ్లు కంప్యూటర్‌తో దోస్తీ, సంపాదించుకున్న అనుభవంతో ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 2016లో ‘అవలాన్స్ గ్లోబల్ సోల్యూషన్స్’ సంస్థను నెలకొల్పా. ముంబయి కేంద్రంగా నా స్నేహితుడు రాజ్ దంగర్‌తో కలిసి ప్రారంభించిన ఈ కంపెనీ కొద్ది రోజులకే అందరి నోళ్లలో నానింది. ఆదరణ బాగా పెరిగింది. క్రమంగా సేవలు విస్తరించాం. ఇప్పుడు బెంగళూరుతో పాటు అమెరికాలోని న్యూజెర్సీలో కూడా మా ఫ్రాంచైజీలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల సంస్థలకూ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సేవలు అందిస్తున్నాం. మా క్లయింట్స్ జాబితాలో నోవార్టిస్, సెయిల్,రిలయన్స్, ఐటీసీ, పెప్సీకో, అదానీ, జేఎస్‌డబ్ల్యూ, సన్ ఫార్మా, జీఈ, ఎల్ అండ్‌టీ, ఓఎన్‌జీసీ తదితర బడా కంపెనీలున్నాయి.
🔴పైరసీ ని …ఇలా అడ్డుకడతాం :
సినీ పరిశ్రమను పీడిస్తున్న ప్రధాన సమస్య… పైరసీ. సినిమా విడుదలైన రోజునే దాని కాపీ నెట్‌లో ప్రత్యక్షమవుతోంది. దీనివల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు మేము ఓ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాం. తద్వారా బాలీవుడ్, గుజరాతీ సినిమాలను ఇప్పటి వరకు 95 శాతం పైరసీ బారి నుంచి కాపాడగలిగాం. వాటిల్లో ‘నమస్తే ఇంగ్లండ్, ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, టోటల్ ఢమాల్, అయ్యారీ, భాగీ-2 వంటి చిత్రాలెన్నో ఉన్నాయి. చిత్రం డిజిటల్ హక్కులను పరిరక్షించి, ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేసిన వాటిని కనిపెట్టి, ప్లే కాకుండా నియంత్రించగలిగాం. నిర్మాతలు, బయ్యర్లకు పైరసీ నుంచి ఊరట కల్పించాం. మేం రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంజెలిజన్స్ (ఏఐ) ఆధారిత యాంటీ పైరసీ సొల్యూషన్స్ వల్ల వందల కోట్ల రూపాయలు వెండితెర, బుల్లితెర నిర్మాతలకు ఆదా అయింది. బాలీవుడ్‌తో పాటు ప్రముఖ టీవీ ఛానల్స్, నెట్‌ఫ్లిక్స్, సౌత్ అమెరికన్, యూరోపియన్ ప్రొడక్షన్ హౌస్ వంటివెన్నో మా సేవలు అందుకుంటున్నాయి. సినిమా బడ్జెట్‌ను బట్టి విడుదలైనప్పటి నుంచి మూడు నెలల కాలం దాకా సినిమా పైరసీని అరికట్టేందుకు రూ.4 లక్షలు చార్జి చేస్తున్నాం. అలాగే సైబర్ నేరాలను ఛేదించడంలో పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలకు సహకరిస్తున్నాం. దీని కోసం మా వద్ద పదిహేను మంది బృందం పనిచేస్తోంది.
🔴సేవలు :
నాలాగా ఎంతో మంది ఔత్సాహికులు మన చుట్టూ ఉన్నారు. సామర్థ్యం ఉన్నా, సరైన అవకాశాలు లేక వెనుకబడిపోతున్నారు. అలాంటి వారి కోసం దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సెమినార్లు, వర్క్‌షా్‌పలు నిర్వహిస్తున్నా. ఫేస్‌బుక్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు కూడా సేవలు అందిస్తున్నాం. ‘అవలాన్స్’కు నేనే సీఈఓ.
🔴ఎన్నో రికార్డ్ లు :
ఎథికల్ హ్యాకర్‌గా ఎన్నో అవార్డులు, అభినందనలూ అందుకున్నా. మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్-100 ఎథికల్ హ్యాకర్స్‌లో నేనూ ఒకడిని. అలాగే దేశంలోని టాప్-10లో ఐదో ర్యాంకర్‌ని. మైక్రోసాఫ్ట్ ‘మోస్ట్ వేల్యుబుల్ ప్రొఫెషనల్’ అవార్డు దక్కింది. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ పేరు నమోదైంది. హ్యాకింగ్‌కు ముందే హ్యాకర్‌ను హ్యాక్ చేయాలన్నది నా అభిమతం. ఈ స్థాయికి రావడానికి నేను పెట్టిన పెట్టుబడి… పట్టుదల, పరిశ్రమ అని తన అనుభవాన్ని..వివరించాడు..ఆ యువకుడు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.