Teluguwonders:
గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం అన్నారు. మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఒక రికార్డు అన్నారు. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. ఆరు రోజుల పాటు పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 20 లోగా ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్యోగాల తరహాలోనే అన్ని సౌకర్యాలు వారికి నిర్ణీత కాల వ్యవధి తరువాత అందుతాయని చెప్పుకొచ్చారు. బదిలీలు కూడా ఉంటాయని స్పష్టం చేసారు.
సచివాలయ పరీక్షల నిర్వహణ పైన అధికారులు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు రాష్ట్రంలోని 5,314 పరీక్షా కేంద్రాల్లో గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలకు వివిధ కేటగిరీల్లో 21.69 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు స్పష్టం చేసారు. 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించారు. క్రొత్తగా ఏర్పాటుచేసే 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు సుమారు 35 రకాల సేవలతో అక్టోబర్ 2 నుండి అమలులోకి తీసుకొని రావటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్షా ఫలితాల మెరిట్ ఆధారితంగానే వుంటుందని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి విడుదల చేసిన “కీ” కు సంబంధించిన అభ్యర్థుల నుండి 52 వేల అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఒకే ప్రశ్నకు 2 నుండి 3 వేల అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. పరీక్ష ప్రశ్నపత్రాల తయారీలో ఏపీపీఎస్సీ ప్రమాణాలనే పాటించామని అధికారులు స్పష్టం చేసారు. ప్రశ్నా పత్రాల్లో కఠినంగా 25 శాతం, తేలికైనవి 25 శాతం, సాధారణ ప్రశ్నలు 50 శాతం ఉండేలా రూపొందించామని వెల్లడించారు. తమకు ఏపీపీఎస్సీ, ఎస్సీఈఆర్టీ, ఏపీపీఎఫ్ఎస్ఎస్, టాటాటెక్ లాంటి పలు సంస్థలు దోహదపడ్డాయని వివరించారు.
జిల్లాల వారీగా మెరిట్ లిస్టులు:
జిల్లాలవారిగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా యూపీఎస్సీ స్థాయిలోనే 14 లక్షల మంది పరీక్షలు రాసిన రికార్డు ఉండేది. హాజరుశాతం కూడా 50 శాతంగా ఉండేది. కానీ దేశంలోనే తొలిసారిగా 20 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాయడం, 88 శాతంకు పైగా హాజరు అవడం రికార్డు అని అభివర్ణించారు.ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించడం గొప్ప విజయంగా అధికారులు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లుగా చేరిన వారు సైతం ఈ పరీక్షలకు హాజరు అయ్యారని ఫలితాల తరువాత ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి ఒకటే సారి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతిరోజూ 3.50 లక్షల పేపర్లను (ఓఎమ్ఆర్) స్కానింగ్ చేస్తూ ఇప్పటికే స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని..బదిలీలు సైతం ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటర్వ్యలు ఉంటాయంటూ ప్రచారం చేస్తున్నారని.. అటువంటి ఆలోచన లేదని ప్రభుత్వాధికారులు స్పష్టత ఇచ్చారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.