Managlagiri:మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్.కే.)క్యాపు కార్యాలయ నిర్మాణ పనులు గత రెండు రోజుల నుంచి చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారి వెంబడినే ఉన్న వై. సీ. పీ కార్యాలయంలోనే ఎమ్మెల్యే ఆర్కే ప్రజలకు అందుబాటులో ఉండేవారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యాలయానికి నాయకులు,కార్యకర్తల తాకిడి పెరగడంతో సందర్శకులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో గౌతమబుద్ధా రోడ్డు వెంబడినే ఉన్న ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ఎన్నికల కార్యాలయాన్ని నిర్వహించారు.
అయితే ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్.కే.) తిరిగి రెండవసారి నియోజకవర్గ ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఒక దశలో ఎమ్మెల్యే ఆర్.కే. కు మంత్రి పదవి కూడా దక్కుతుందని భావించారు. తాత్కాలికంగా ఉన్న ఎన్నికల కార్యాలయాన్ని తొలగించి పట్టణంలోని ఊర్వశి థియోటర్ పక్కన విశాలమైన స్థలంలో మంత్రి నూతన క్యాంపు కార్యాలయాన్ని నిర్మించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాయి. నేల చదును చేసి నిర్మాణ పనులకు సైతం టెంకాయకొట్టారు.అయితే సీ.ఎం. జగన్ క్యాబినెట్లో ఎమ్మెల్యే ఆర్.కే.కు తొలి విడుతలో మంత్రిగా అవకాశం దక్కకపోవడం… దీనికి తోడు ఒకరిద్దరి వైసీపీ నాయకులు అనారోగ్యానికి సైతం గురిఅయ్యారు. దీంతో ఆ స్థలం ఇక వారికి తమకు కలసిరాదనే సెంటిమెంట్ భయం కొందరి నాయకులకు పట్టుకుంది. దీంతో ఆ స్థలాన్ని అలా వదిలేసి పట్టణంలోని ఆటోనగర్ సమీపం గౌతమబుద్ధా రోడ్డు వెంబడి ఉన్న రేకుల షెడ్డు స్థలంలో ఎమ్మెల్యే ఆర్.కే. క్యాంపు కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా శిథిలావస్థకు చేరిన షెడ్డును పూర్తిగా నేలమట్టం చేసి ట్రాక్టర్లతో గ్రావెల్ మట్టి మెరకగా పోస్తున్నారు. గత రెండు రోజులుగా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీలైనంత త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. నిర్మాణ పనులు పూర్తయితే ఎమ్మెల్యే ఆర్.కే. ఇక ఇక్కడనే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఇప్పటికే జాతీయ రహదారి పక్కనే ఆత్మకూరు వద్ద ఉన్న భవనాన్ని పార్టీ కార్యాలయంగా వినియోగించుకోనున్నారు.ఏది ఏమైనా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్.కే ఇకపై పేద ప్రజలకు తన క్యాంప్ కార్యాలయంలో నిత్యం ఏదో సమయంలో అదుబాటులో ఉండనున్నారు.
ఎన్.నాగరాజు, జర్నలిస్ట్, మంగళగిరి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.