నిన్నటి నుంచి రోహిణి కార్తె మొదలయ్యింది. సగటుకన్నా ఆరు డిగ్రీల వరకూ అధిక వేడితో
ప్రజలు అల్లాడిపోతున్నారు.
🔥రోహిణీ కార్తె : రోహిణీ అంటే రోళ్లు పగిలే కాలం అంటారు పెద్దలు . అలాంటి రోహిణీ కార్తె శనివారం నుంచి ప్రారంభం కాగా, అందుకు తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల తరువాత కూడా వడగాడ్పులు వీశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అగ్నికీలల్లా సూర్యకిరణాలు తాకుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు జిల్లా నూజెండ్లలో గరిష్ఠంగా 46.39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, తెలంగాణలోని రామగుండం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఎండవేడిమి నమోదైంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం పూట సరైన రక్షణ చర్యలు లేకుండా బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఇదే సమయంలో రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ వరకూ కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడటంతో వచ్చే రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులకు అవకాశం ఉందని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఇదిలావుండగా,
🌧వర్ష సూచన :నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ ను దాటి, ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈ నెలాఖరు నాటికి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.