స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఎఫ్‌డీ, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఇప్పుడు మరో షాకిచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు మళ్లీ వసూలు చేస్తామనే బ్యాంక్ ఝలక్ నుంచి తేరుకోకముందే మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించింది.
- రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత
- 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు
- అక్టోబర్ 10 నుంచే ఈ నిర్ణయం అమలులోకి
- దీంతో కస్టమర్లకు తక్కువ రాబడి
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు మరో షాకిచ్చింది. రికరింగ్ డిపాజిట్లపై (ఆర్‌డీ)పై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచే తగ్గింపు నిర్ణయం అమలులోకి వచ్చింది. దీంతో ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి తక్కువ రాబడి వస్తుంది.
ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాల కాలపరిమితి ఏడాది నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ఇక వీటిపై వడ్డీ రేటు 5.8 శాతం నుంచి 6.25 శాతం మధ్యలో పొందొచ్చు. సాధారణ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఇంకొంచెం ఎక్కువ వడ్డీ లభించొచ్చు.
ఎస్‌బీఐ ఏడాది ఆర్‌డీ అకౌంట్లపై ఇప్పుడు 5.8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే రెండేళ్ల కాలపరిమితిలోని ఆర్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిప్ పాయింట్లు తగ్గింది. ఇప్పుడు వీటిపై 6.5 శాతం కాకుండా 6.4 శాతం వడ్డీ రేటు మాత్రమే లభిస్తుంది. ఇకపోతే ఎస్‌బీఐ మీడియం టర్మ్ రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. 2-5 ఏళ్ల మీడియం టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతంగా కొనసాగుతోంది.
స్టేట్ బ్యాంక్ అంతేకాకుండా దీర్ఘకాల రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను మార్చలేదు. స్థిరంగానే కొనసాగించింది. 5 ఏళ్ల, 10 ఏళ్ల మధ్యలోని ఆర్‌డీలపై వడ్డీ రేటు 6.25 శాతంగానే కొనసాగుతోంది.
కాగా స్టేట్ బ్యాంక్ ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. అక్టోబర్ 10 నుంచే కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఎఫ్‌డీలపై మాత్రమే కాకుండా బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్లపై కూడా అందించే వడ్డీ రేట్లలో కోత విధించింది. నవంబర్ 1 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గుతుంది.
స్టేట్ బ్యాంక్ ఇంతటితో ఆగిపోలేదు. హోమ్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజును మళ్లీ వసూలు చేస్తామని ప్రకటించి పండుగ సీజన్‌లో కస్టమర్లకు భారీ షాకే ఇచ్చింది. సాధారణంగా డిసెంబర్ చివరి వరకు లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయమని ప్రకటించిన బ్యాంక్ తర్వాత తన మాట మర్చుకుంది. ప్రాసెసింగ్ ఫీజు వసూలుతో కస్టమర్లపై రూ.30,000 వరకు భారం పడనుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.