Teluguwonders:
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తులు భారీగా అందాయి. నోటిఫికేషన్ ప్రకారం శనివారం(10 ఆగస్ట్ 2019) రాత్రి వరకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వగా.. వరదలు, వర్షాల కారణంగా దరఖాస్తు గడువును ఒక్క రోజు పెంచడంతో ఆదివారం(11 ఆగస్ట్ 2019) 58 వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మొత్తం 22.7లక్షల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు.
రాష్ట్రంలో 13,065 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలకు 1.26 లక్షల పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సచివాలయ పోస్టులు దక్కించుకునేందుకు సుమారు 17.25 లక్షల మంది ఓటీపీఆర్ రిజిస్టర్ చేసుకోగా.. 7,966 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల కోసం విద్యుత్ సంస్థలు వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి.
కేటగిరీ-1లోని నాలుగు రకాల ఉద్యోగాలకు కలిపి నిర్వహించే ఒకే రకమైన రాత పరీక్షకు అత్యధికంగా 12,86,984 దరఖాస్తులు వచ్చాయి. ఈ కేటగిరీలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, గ్రామ, వార్డు మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉద్యోగాలు ఉన్నాయి. కేటగిరి-2(ఏ)లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ ఉద్యోగాలకు 1లక్షా 41వేల 3వందల 25 మంది, కేటగిరి-2 (బీ)లో భర్తీ చేసే వీఆర్వో, సర్వే అసిస్టెంట్ ఉద్యోగాలకు 1లక్షా 72వేల 4వందల 18మంది దరఖాస్తు చేసుకున్నారు.
కేటగిరిలో-3లో మిగిలిన 11 రకాల ఉద్యోగాలకు మొత్తం 6లక్షల 68వేల 5వందల 77మంది దరఖాస్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 2లక్షల 13వేల 7వందల 51మంది దరఖాస్తు చేసుకున్నారు. విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి కూడా ఒక్కో జిల్లాకు 2లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. విజయనగరం జిల్లా నుంచి తక్కువ దరఖాస్తులు అందినట్టు అధికారులు వెల్లడించారు. అక్టోబరు 2 నాటికి పరీక్షలు, ఎంపిక పూర్తయి అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.