Teluguwonders:
గవర్నర్ నరసింహన్ పదవీ బాధ్యతలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రపతి పాలన, రాష్ట్ర విభజనకు సాక్షిగా నిలిచిన నరసింహన్‌ను ఆత్మీయ సన్మానం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలో అతి ఎక్కువ కాలం గవర్నర్‌గా చేసిన రికార్డు సృష్టించిన నరసింహన్‌కు సాయంత్రం వీడ్కోలు పలుకుతోంది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం. మరోవైపు.. కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రేపు బాధ్యతలు తీసుకోనున్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఈఎస్ఎల్ నరసింహన్ 2009 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఓ రేంజ్‌లో ఉన్నప్పుడు అప్పటి యుపీఏ ప్రభుత్వం ఏరికోరి నరసింహన్‌ను పంపింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా సుధీర్ఘ కాలం కేంద్రంలో ప్రభుత్వాలు మారినా గవర్నర్‌గా కొనసాగారు.
కేంద్ర నిఘా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న నరసింహన్ ఉద్యమ సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఎన్‌డీ తివారీ వారసుడిగా ఏపికి వచ్చిన గవర్నర్ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేశారు. దేశ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన తెలుగు రాష్ట్రాల విభజన నరసింహన్ హయాంలోనే జరిగింది.
2009 డిసెంబర్ నుంచి రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ దాకా ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా కొనసాగారు నరసింహన్. విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఐదున్నరేళ్లపాటు ఉన్నారు. జూలై 24న బిశ్వ భూషన్ హరిచందన్‌ను ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించడంతో ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. రాష్ట్రపతి పాలన వచ్చింది. దీంతో తొమ్మిదేళ్ల తొమ్మిది నెలలు గవర్నర్‌గా చేయడమే కాక, రాష్ట్రపతి పాలన కూడా చేసి రికార్డుల్లోకెక్కారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1953 నుంచి ఇప్పటిదాకా 21 మంది గవర్నర్లుగా పనిచేశారు. అత్యధికంగా ఏడేళ్లు కృష్ణకాంత్ పనిచేయగా.. ఆ రికార్డుతో పాటు వరుసగా మూడు నెలలు తక్కువ పదేళ్లు పూర్తి చేసుకున్న రికార్డులను సొంతం చేసుకున్నారు నరసింహన్.
ఇలా తెలుగు రాష్ట్రాల్లో.. తనదైన ముద్ర వేసుకున్న తమిళనాడుకు చెందిన ఈసీఎల్ నరసింహన్. ముక్కుసూటిగా వ్యవహరించే గవర్నర్‌గా.. అధికారులకు చివాట్లు పెట్టే విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే గవర్నర్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవడం… కార్పొరేట్ ఆసుపత్రులపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టే విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. కాళేశ్వరంను త్వరగా పూర్తి చేసినందుకు కేసీఆర్‌ను కాళేశ్వరరావుగా పిలిచినా.. నిబంధలకు విరుద్దంగా ఉందని మున్సిపల్ బిల్లును వెనక్కి పంపించినా అన్ని ఆయనకే చెల్లాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.