Teluguwonders:
యూపీఎస్సీలో పలు పోస్టుల భర్తీకి గురువారం (ఆగస్టు 8,2019) నోటిఫికేషన్ విడుదలైంది. 415 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA)లో 370, నేవల్ అకాడమీ(NA)లో 45 పోస్టులు భర్తీ చేయనున్నారు. NDA ఖాళీలను చూస్తే.. సైన్యంలో 208, నేవీలో 42, వాయుసేనలో 120 ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 3లోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 17న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీకి రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితం. మరిన్ని వివరాలకు upsc.gov.in/ వెబ్‌సైట్ లో చూడొచ్చు.
NDA, NA ఎగ్జామినేషన్‌ను ప్రతిఏటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రథమార్దానికి జనవరి 9న నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఏప్రిల్ 21న రాతపరీక్ష నిర్వహించింది. ఇక రెండో విడతగా ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు :
* ఆర్మీ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్ పాసై ఉండాలి.
* ఎయిర్‌ఫోర్స్, నేవల్ ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథ్స్ లతో ఇంటర్ పాస్. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 02.01.2001 నుంచి 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
రాత పరీక్ష ఇలా ఉంటుంది
* మొత్తం 900 మార్కులకు రాతపరీక్ష. రెండు పేపర్లుంటాయి.
* పేపర్-1(మ్యాథ్స్)కు 300 మార్కులు, పేపర్-2(జనరల్ ఎబిలిటీ టెస్ట్)కు 600 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.
* రాతపరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 900 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
శిక్షణ, స్టైపెండ్:
నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు మూడేళ్లపాటు అకడమిక్, ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. తొలి రెండున్నరేళ్లు 3 విభాగాల వారికి ఒకే విధమైన శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ డిగ్రీ ప్రదానం చేస్తుంది. ఆర్మీ క్యాడెట్లకు బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్స్)/ బీఏ డిగ్రీని; నేవల్, ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లు బీటెక్ డిగ్రీ సర్టిఫికెట్ పొందుతారు.
*ఎజిమలలోని నేవల్ అకాడమీకి ఎంపికైనవారికి నాలుగేళ్లపాటు అకడమిక్, ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణ అనంతరం వీరికి బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
*ఎన్‌డీఏలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొన్న తర్వాత ఆర్మీ అభ్యర్థులను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి, నేవల్ అభ్యర్థులను ఇండియన్ నేవల్ అకాడమీ(ఎజిమల)కి, ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులను హైదరాబాద్‌లోని ఏఎఫ్‌ఏకు పంపిస్తారు. వీరికి ఆయా విభాగాల్లో ఏడాది పాటు శిక్షణ ఇచ్చి అనంతరం లెఫ్ట్‌నెంట్ హోదాలో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు.
* శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంతోపాటు దేశవ్యాప్తంగా 40కి పైగా నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 ఆగస్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 3 సెప్టెంబర్ 2019
రాతపరీక్ష : 17.11.2019
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.