Teluguwonders:
ఏపీలో రేషన్ దుకాణాల తరహాలోనే మీ- సేవ కేంద్రాలకు ఇక కాలం చెల్లినట్లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రామ సచివాలయాల రాకతో ప్రభుత్వ సేవలన్నీ ఇకపై ఏకీకృతం కానున్నాయి.
💥ఏపీలో మీసేవ కేంద్రాలు బంద్… ?
ఏపీలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల రాకతో పాలనలో పెను మార్పులు రానున్నాయి. ఏపీ సచివాలయం తరహాలో ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ ఈ సేవలను అందించిన మీ-సేవ కేంద్రాలు మూతపడే అవకాశముంది. దీనిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది.
💥 సచివాలయాల్లో అందుబాటులోకి రానున్న మీ సేవ:
ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో లబ్దిదారులకు అందించే డబ్బులు, ధృవపత్రాలు, అనుమతుల జారీ, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు వంటి దాదాపు 367 రకాల ప్రభుత్వ సేవలు, 30కి పైగా ప్రైవేటు సేవలు ఇప్పటివరకూ మీ సేవ కేంద్రాల్లో లభిస్తున్నాయి. వీటిలో కరెంటు బిల్లులు, బీఎస్ఎన్ఎల్ ఫోన్ బిల్లులు, ఇతరత్రా బిల్లు చెల్లింపులను కూడా మీ సేవ కేంద్రాల్లో అనుమతిస్తున్నారు. ఓటరు కార్డుల జారీ, పాసుబుక్కుల జారీ వంటి సేవలు కూడా మీ సేవల్లో అందుబాటులో ఉంచారు. కానీ మారుతున్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని వీటితో పాటు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చిన ప్రభుత్వ పథకాల వర్తింపు, రేషన్ పంపిణీ, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి ప్రభుత్వ ప్రాధాన్య సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి తెస్తున్నారు . దీంతో ఇప్పటివరకూ ఆయా సేవలకు కేంద్రంగా ఉన్న మీ సేవ సెంటర్లు మూతపడక తప్పని పరిస్ధితి రానుంది.ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 9 వేల మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉన్నాయి. మీ సేవ కేంద్రాల మూసివేతకు ప్రభుత్వం సిద్దమైతే అందులో పని చేస్తున్న సిబ్బంది రేషన్ డీలర్ల తరహాలోనే రోడ్డెక్కే అవకాశముంది. వీరికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం చూపుతుందో చూడాలి.
🔴 తొలి దశలో మూతపడనున్న మీ సేవ కేంద్రాలు :
మీ సేవ సెంటర్ల వల్ల ప్రభుత్వ సేవలు నామమాత్రపు రుసుముతో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడం, కాంట్రాక్టు తీసుకున్న వారు సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్ధితులు లేకపోవడంతో అవి నాసిరకంగా తయారయ్యాయి. దీంతో మీ సేవ సెంటర్లకు వెళ్తున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. దీన్ని గమనించిన ప్రభుత్వం.. మీ సేవకు అనుమతిచ్చిన సేవలను గ్రామ సచివాలయాలకు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ఏర్పాటు వల్ల ఆయా ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు తొలి దశలో మూతపడే అవకాశముంది. ఈ విధానం విజయవంతమైతే భవిష్యత్తులో పట్టణాలు, నగరాల్లో ఉన్న మీ సేవ కేంద్రాలకూ దీన్నే వర్తింపచేస్తారు.
🌟ప్రజల ఆదరణ చూరగొనాలనే:
గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల రూపంలో 4 లక్షల మంది ఉద్యోగులను తీసుకుంటున్న సర్కారు… ప్రభుత్వ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజల ఆదరణ చూరగొనాలనే ఆశయం పెట్టుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. దశాబ్దానికి పైగా సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాల మూత అంత సులువు కాదని కొంత మంది నిపుణులు భావిస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.