Teluguwonders:
టైటిల్ : ఎవరు
జానర్ : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
తారాగణం : అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ
సంగీతం : శ్రీ చరణ్ పాకల
దర్శకత్వం : వెంకట్ రామ్‌జీ
నిర్మాత : పీవీపీ
క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్ అన్నీ తానే అయి వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అడివి శేష్ మరోసారి సక్సెస్ సాధించాడా..?
🗝కథ :
ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే.. ఓ సాప్ట్ వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే మధ్య తరగతికి చెందిన సమీరా (రెజీనా).. ఆ కంపెనీ బాస్‌కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో.. తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ (నవీన్ చంద్ర)తో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ సమీరాపై అత్యాచారం జరగడం.. అక్కడే అశోక్ హత్య చేయబడటం జరుగుతుంది. ఈ హత్య, అత్యాచారం ఎలా జరిగింది? ఎవరు చేశారన్నదే కథలో ట్విస్ట్.
మరోవైపు కూనూర్ ప్రాంతంలో రిసార్ట్స్ నిర్వహించే వినయ్ వర్మ (మురళీ శర్మ) కనిపించకుండా పోతారు. అతన్ని వెతుక్కుంటూ క్యాన్సర్‌తో బాధపడే ఆయన కొడుకు రాహుల్ (నిహాల్) పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు. అదే స్టేషన్‌లో ఎస్.ఐగా పనిచేస్తుంటాడు విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్). డబ్బు ఇస్తే ఎలాంటి పనినైనే చేసే లంచావతారం విక్రమ్ వాసుదేవ్.. వినయ్ వర్మ కేసును డీల్ చేయడానికి రాహుల్ దగ్గర లంచం తీసుకుంటాడు. ఈ కేసుకి సమీరా కేసుకి లింకేంటి? అసలు విక్రమ్ వాసుదేవ్ ‘ఎవరు’? వినయ్ వర్మ ‘ఎవరు’? రాహుల్ ‘ఎవరు’? సమీరాని రేప్ చేసింది ‘ఎవరు’? అశోక్‌ని హత్య చేసింది ‘ఎవరు’? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ఎవరు’? చిత్రం
🗝నటీనటులు :
థ్రిల్లర్ కథాంశాల్లో నటించటం అడివి శేష్‌కు కొట్టిన పిండి. అందుకే విక్రమ్ వాసుదేవ్ పాత్రలో ఈజీగా నటించేశాడు శేష్. అనవసరమైన బిల్డప్‌లు భారీ ఎమోషన్స్, పంచ్ డైలాగ్‌లు లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో రెజీనా అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఇటీవల ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్న రెజీనా ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో నటించింది. సమీరాగా చాలా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కింది. కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, మురళీ శర్మ, నిహాల్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు.
🗝టెక్నికల్ టీం:
శ్రీ చరణ్ పాకాల సంగీతం బాగుంది. ఇలాంటి సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ కీలకం. ఆ విషయంలో ఈయన సరైన న్యాయం చేసాడు. ఎడిటింగ్ బాగుంది. లెంత్ కూడా తక్కువే కావడంతో ఎలాంటి కంప్ల్లైంట్స్ లేకుండా సినిమా ఎంజాయ్ చేసేయొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. తక్కువ బడ్జెట్ అయినా కూడా సినిమాలో రిచ్ నెస్ కనిపించింది. దర్శకుడిగా వెంకట్ రాంజీ ఆకట్టుకున్నాడు.
🗝విశ్లేషణ:
ప్రతి సినిమా మాదిరి ఇందులోనూ రంధ్రాన్వేషణ చేస్తే.. ఫస్టాఫ్‌లో ఉన్నంత గ్రిప్పింగ్ సెకండాఫ్‌లో కాస్త తగ్గుతుంది. ఇంటర్వెల్ సీన్‌తో కథ రసకందాయంలో పడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించినా అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయినట్టు కనిపిస్తాయి. కామెడీ, మసాలాలు లేకపోవడం లోటే కాని.. బీ సీ సెంటర్లలలో ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలంటే అవి తప్పనిసరే. ఇక మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సీరియస్ కథను ఆస్వాదిస్తారు కాని.. మరీ ఇంత సీరియస్ స్క్రీన్ ప్లేని మాస్ ఆడియన్స్ సీన్ టు సీన్ ఫాలో కావడం ఆ లాజిక్‌లు, మ్యాజిక్‌లను ఎక్కించుకోవడం కాస్త కష్టమే. అయితే రొటీన్ మూస చిత్రాలకు పెద్ద రిలీఫ్ ఈ ‘ఎవరు’ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
🗝ప్లస్ పాయింట్స్ :
కథా కథనం,
లీడ్ యాక్టర్స్ నటన,
నేపథ్య సంగీతం.
🗝మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం…
🗝ఓవరాల్‌గా.. :
అడివి శేష్, రెజీనా ‘ఎవరు’? అది తెలుసుకోవడానికైనా సినిమా చూడాలి. బోనస్‌గా బోలెడంత సస్పెన్స్.. అంతకు మించిన థ్రిల్లింగ్.
👉రేటింగ్ : 3.5/5
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.