Teluguwonders: చేనేత కళాకారులు వలస జీవితాన్ని ఆవిష్కరించింది. నమ్మకున్న కళ కూడుపెట్టని స్థితి, ఆసు యంత్రాన్ని సాధించాలన్న కసి, పట్టుదల, నిండు గర్బిణితో ఉన్న భార్య మల్లేశం జీవితాన్ని ఆటుపోట్లకు గురిచేస్తాయి. ఇలాంటి అంశాలను చక్కగా చూపుతూ వాటిని సహజసిద్ధమైన రీతిలో ప్రేక్షకులకు అందించే ప్రయత్నంగా సినిమా సాగుతుంది. కమర్షియల్ సినిమా ఫార్మాట్‌కు భిన్నంగా సినిమాకు కావాల్సిన వాణిజ్య విలువలతో మల్లేశం సినిమా తెర మీద కొన్ని జీవితాలను ఆవిష్కరిస్తుంది.
🔴నటీనటులు :
ప్రియదర్శి, అనన్య నాగళ్ల, ఝాన్సీ, చక్రపాణి ఆనంద తదితరులు
దర్శకత్వం: రాజ్ రాచకొండ
నిర్మాతలు: శ్రీ అధికారి, రాజ్ రాచకొండ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్ధారెడ్డి
మ్యూజిక్: మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫి: బాలు శాండిల్య
ఎడిటింగ్: రాఘవేందర్ ఉప్పుగంటి
రిలీజ్: 2019-06-21
చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో మల్లేశం సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భావోద్వేగమైన అంశాలతో రూపొందిన ఈ సినిమా చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఏమిటీ అనే నేపథ్యం లో వారు తమ సమస్యలను ఎలా అధిగమించాలనే కోణంలో తెరకెక్కిందనే మాట బలంగా వినిపిస్తున్నది.
👉చేనేత రంగంలో మహిళ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న ఆసు పనికి యాంత్రిక సహాయం అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో చింతకింది మల్లేశం అనే చేనేత కళాకారులు తన పట్టుదలకు పదనుపెట్టి ఆసు యంత్రాన్ని కనుగొనడం, ఆయనకు పద్మశ్రీ రావడం లాంటి అంశాలతో ఓ కామన్ మ్యాన్ బయోపిక్‌గా మల్లేశం రూపొందిందనే అభిప్రాయం సినిమా విడుదలకు ముందు వ్యక్తమైంది. . భావోద్వేగమైన అంశాలతో రూపొందిన మల్లేశం సినీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
🔴 కథ :
దిగువ తరగతి చేనేత కుటుంబంలో పుట్టిన మల్లేశం (ప్రియదర్శి)కు బాల్యం నుంచే కష్టాలు, సమస్యలు కళ్ల ముందే కదలాడుతాయి. ఆర్థిక సమస్యలతో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడటం పసివాడిని కలిచివేస్తుంది. అలాగే ఆసు పట్టే తల్లి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరో తరగతిలోనే చదువు ఆపేస్తాడు. కుటుంబ భారాన్ని కొంత తన భుజానికి ఎత్తుకొంటాడు. తన తల్లికే కాకుండా చేనేత కుటుంబంలో ఏ మహిళ కూడా ఆసు కష్టాలను అనుభవించకూడదనే ఆలోచనతో ఆసు యంత్రాన్ని కనిపెట్టేందుకు పూనుకొంటాడు.
🔴 మలుపులు :
ఆసు యంత్రాన్ని కనుగొనే క్రమంలో ఎదురైన కష్టాలేంటీ? గ్రామస్థుల సహకారం ఎలా ఉంది? జీవితానికే సవాల్‌గా నిలిచిన క్షణాల్లో భార్య (అనన్య) ఎలా నిలిచింది? మల్లేశం భుజానికి ఎత్తుకొన్న కార్యాన్ని తండ్రి (చక్రపాణి) ఎందుకు అడ్డుకొనేందుకు ప్రయత్నం చేశాడు. తన కార్యదీక్షకు తల్లి (యాంకర్ ఝాన్సీ ) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చింది. చివరకు ఎలాంటి సమస్యలను ఎదురించి ఆసు యంత్రాన్ని కనుగొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే మల్లేశం సినిమా.
👉ఫస్టాఫ్ :
ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఓ చేనేత కళాకారుడి (టీఎన్ఆర్) కుటుంబం ఆత్మహత్యతో ఓ భావోద్వేగమైన అంశంతో మల్లేశం సినిమా మొదలవుతుంది. మల్లేశం బాల్యంలోని రకరకాల ఉద్వేగ, వినోదభరితమైన సన్నివేశాల మేలవింపుతో ఫీల్‌గుడ్‌గా సినిమా సాగుతుంది. 30 నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తులకు మరోసారి బాల్యాన్ని గుర్తు చేసేవిధంగా సన్నివేశాలు సాగుతుంటాయి. గోళీల ఆట, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆటలన్నీ ప్రస్తుత తరానికి తెలిసే విధంగా సీన్లు హృదయానికి హత్తుకునేలా సాగుతాయి. చేనేత జీవితాల్లో కన్నీళ్లు, కష్టాలు తెరపైన సజీవంగా సాగుతాయి. ఇలాంటి సమస్య మధ్య మల్లేశం ప్రేమ, పెళ్లి జీవితం అత్యంత సహజసిద్ధంగా తెరపైన సాక్షాత్కరిస్తాయి. ఇలాంటి అంశాలతో గుండెను ప్రతీక్షణం తట్టుతూ తొలిభాగం ముగుస్తుంది.
🔴సెకండాఫ్ :
కాకపోతే రెండో భాగం కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది.
👉దర్శకత్వ ప్రతిభ :
కమర్షియల్ అంశాల మోజు, అర్థపర్థం లేని థ్రిల్లర్స్, సినిమా అంటే ద్వందార్థాలే అనే భ్రమ కలిగిస్తున్న ప్రస్తుత రోజుల్లో కడిగిన ఆణిముత్యం లాంటి చిత్రం మల్లేశం. ఇలాంటి సినిమా కూడా తీసి అన్ని వర్గాల ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయవచ్చు అని నమ్మిన దర్శకుడు రాజు రాచకొండను ముందుగా అభినందించాలి. మల్లేశం జీవితంలోని కొన్ని కీలక సంఘటనలు తీసుకొని కొంత ఫిక్షన్‌ను జోడించి రాసుకొన్న సీన్లు అద్భుతంగా ఉంటాయి. పాత్ర మధ్య మేలవింపు చక్కగా కుదిరింది. అందుకు దర్శకుడి ప్రతిభ పాటవాలే కారణమని చెప్పవచ్చు. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి ఆమడదూరంలో ఉండే ఈ సినిమాను ఎమోషనల్‌గా కాన్వస్ గా మలిచిన తీరు ప్రశంసనీయం.
🔴హీరో, హీరోయిన్ల నటన :
ప్రేక్షకుల దృష్టిలో ఇప్పటి వరకు ప్రియదర్శి ఓ కమెడియన్. కానీ మల్లేశం సినిమా ప్రియదర్శి నటనలోని మరో కోణాన్ని చూపిస్తుంది. పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేంతగా నటించాడు. కీలక సన్నివేశాల్లో ప్రియదర్శి నటన మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఇక ప్రియదర్శి నటన గురించి చెప్పడం కంటే తెర మీద చూస్తేనే అదో కొత్త రకమైన అనుభూతి అని చెప్పవచ్చు. ప్రియదర్శికి తోడుగా భార్య పాత్రలో అనన్య నాగళ్ల బ్రహ్మండంగా తెరపైన కనిపించింది. తెలంగాణ యాసతో దిగువ తరగతి కుటుంబంలోని మహిళగా చక్కగా ఆకట్టుకొన్నది. ప్రియదర్శి, అనన్య నటించారనే కంటే తెర మీద జీవించారని చెప్పవచ్చు.
🔴కీలక పాత్రల్లో :
మల్లేశం సినిమాలో తల్లి లక్ష్మీ పాత్రలో యాంకర్ ఝాన్సీ, తండ్రి నర్సింహులు పాత్రలో సీనియర్ నటుడు చక్రపాణి ఆనంద నటించారు. వీరిద్దరి పాత్రలను దర్శకుడు రూపుదిద్దిన తీరు ఓ ఎత్తైతే.. వాటిలో ఆ ఇద్దరు ఒదిగిపోవడం మరొ ఎత్తుగా నిలిచింది. యాంకర్ ఝాన్సీని ఇప్పటి వరకు రకరకాలుగా చూశాం. కానీ ఈ సినిమాలో పేద కుటుంబంలోని పెద్దగా ఆకట్టుకొంటుందే గానీ నటి ఝాన్సీ ఎక్కడా కనిపించదనేంతగా ప్రభావం చూపిస్తుంది. ఇక చక్రపాణి నటన మరో హైట్. క్లైమాక్స్‌లో భావోద్వేగమైన నటన ప్రేక్షకుడిని ఊగిసలాటకు గురిచేస్తుంది.
🔴సాంకేతిక సాంకేతిక అంశాలు :
పాటలు, రీరికార్డింగ్ మరో అదనపు ఆకర్షణ. చివర్లో వచ్చే ఆ చల్లని సముద్ర గర్భం పాట రెండు గంటలకుపైగా సినిమాకు ఓ జస్టిఫికేషన్. 80, 90 నాటి పరిస్థితులను అద్భుతంగా చూపించి ఆర్ట్ విభాగం పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. ఇక గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్నివేశాలను, లొకేషన్లను సినిమాటోగ్రాఫర్ చక్కగా తెరకెక్కించారు. సాంకేతికంగా అన్ని విభాగాలు పనితీరు అద్భుతం అని చెప్పవచ్చు. ఎడిటర్ ఇంకాస్త కత్తెరకు పదునుపెడితే సినిమా ఇంకా బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది.
🔴నిర్మాణ విలువలు :
తెలంగాణ యాస, భాషలో కమ్మదనం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. మల్లేషం సినిమా చూస్తే తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామీణ పద ప్రయోగం, మాటల వాడుక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. వాటిని పట్టుకొనేందుకు, ఈ ప్రాంతపు మట్టి వాసనను రుచి చూపించేందుకు చేసిన పరిశోధనను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అందుకు పెద్దింటి అశోక్ కుమార్, రాజ్ రాచకొండను అభినిందించాలి. మల్లేశం న్యూ జనరేషన్ తెలంగాణ సినిమాగా ఆవిష్కరించడంలో ఈ రచయిత ద్వయం పూర్తిగా సఫలమైంది. వీరి ఆలోచనలకు తగినట్టుగా నిర్మాణ విలువలను పాటించిన యూనిట్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే.
🔴ఫైనల్‌గా :
ఆర్థిక సమస్యలతో చితికిపోయి, ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కళకారులకు గొప్ప నివాళి అర్పించే చిత్రం మల్లేశం సినిమా. అంతేకాకుండా కేవలం చేనేతనే కాదు.. అన్ని రంగాల కళాకారులకు గొప్ప స్ఫూర్తిని అందించే మానో వికాస కేంద్రం అని చెప్పవచ్చు. కమర్షియల్ హోరులో కొన్ని జీవితాలను అధ్యయనం చేసే చిత్రమని చెప్పవచ్చు. వాణిజ్య విలువ కంపుతో వస్తున్న సినిమాల మధ్య మల్లేశం ఓ చక్కటి క్లీన్ అండ్ గ్రీన్ చిత్రం. గొప్ప చిత్రం.
🔴ప్లస్ పాయింట్స్ :
కథ, కథనాలు,
దర్శకుడి ప్రతిభ ,
ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి నటన…
సంగీతం, ఇతర సాంకేతిక విభాగాలు
🔴మైనస్ పాయింట్స్:
సెకండాఫ్
🔴మల్లేశం గొప్ప ప్రయత్నం :
దేశవ్యాప్తంగా చేనేత కళ మరుగున పడుతున్న నేపథ్యంలో కళాకారుల జీవితంలో కష్టాలు, అవస్థలు, సమస్యలను తెరపైన ఆవిష్కరించడానికి చేసిన మల్లేశం సినిమా గొప్ప ప్రయత్నం…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.