2020 సంక్రాంతి బరిలో ఇద్దరు టాప్ హీరోలు బరిలో దిగుతుండటంతో పోటి రసవత్తరంగా మారింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో
, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు
సినిమాలు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
టాలీవుడ్‌కు సంక్రాంతి సీజన్ చాలా పెద్ద మార్కెట్. ఈ సీజన్‌లో రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కలెక్షన్లకు డోకా ఉండదని భావిస్తారు. అంతేకాదు ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పండుగ కావటంతో స్టార్ హీరోలందరూ సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తుంటారు. 2020లో కూడా సంక్రాంతికి రసవత్తర పోరు జరగనుంది.
రెండు భారీ చిత్రాలతో పాటు రెండు మీడియం రేంజ్ సినిమాలు ఈ సీజన్‌లో బరిలో దిగుతున్నాయి. వీటిలో ఏ సినిమా నిలబడుతుంది. ఏ సినిమా గెలుస్తుంది..? అన్న ఉత్కంఠ ఇండస్ట్రీ వర్గాల్లోనూ నెలకొంది. అసలు నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్లు సరిపోతాయా..? కలెక్షన్లు వస్తాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
ఈ సీజన్‌లో ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోలు బరిలో దిగుతుండటం విశేషం. లాంగ్ గ్యాప్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బన్నీ కెరీర్‌కు కీలకమైన సినిమా కావటంతో దర్శక నిర్మాతలు జాగ్రత్తగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే అదే రోజు బరిలో దిగుతున్న మరో స్టార్ హీరో మహేష్ బాబు. మహర్షి సక్సెస్‌తో ఫుల్ ఫాంలో ఉన్న మహేష్, ఎఫ్ 2తో బిగ్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. హీరో, డైరెక్టర్ ఇద్దరూ మంచి ఫాంలో ఉండటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో టఫ్ ఫైట్ తప్పదని భావిస్తున్నారు.
ఇద్దరూ బిగ్ స్టార్స్, రెండూ భారీ నిర్మాణ సంస్థలు కావటంతో థియేటర్ల సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్సే కీలకం. కానీ ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో ఓపెనింగ్స్ మీద భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా మరో రెండు సినిమాలు కూడా ఇదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఎంత మంచివాడవురా
తో పాటు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ
ను కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.మరి అనుకున్నట్టుగా అందరూ ఒకేసారి బరిలో దిగుతారా..? లేక ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అన్న విషయం తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.