సాజిద్‌ను పట్టిస్తే రూ.37 కోట్లు*

Spread the love

*సాజిద్‌ను పట్టిస్తే రూ.37 కోట్లు* *ముంబయి దాడుల సూత్రధారిపై బహుమతి ప్రకటించిన అమెరికా* వాషింగ్టన్‌: 2008 ముంబయి దాడుల (26/11) సూత్రధారి, పన్నెండేళ్లుగా భారత్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్‌ సాజిద్‌ మీర్‌ ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల (సుమారు రూ.37 కోట్లు) బహుమతిని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

పాకిస్థాన్‌ నుంచి సముద్ర మార్గం గుండా 2008 నవంబర్‌ 11న పది మంది ఉగ్రవాదులు ముంబయి చేరుకున్నారు. అనంతరం నగరంలోని 12 ప్రాంతాలపై దాడి చేసి 166 మంది పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఈ నరమేధంలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మృతి చెందారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా, సజీవంగా దొరికిన అజ్మల్‌ అమిర్‌ కసబ్‌కు ఉరిశిక్ష అమలైంది.

దాడిలో ప్రధాన సూత్రధారులుగా హఫీజ్‌ సయీద్‌, లఖ్వీ, సాజిద్‌ మీర్‌ వ్యవహరించారు. ఇందులో సాజిద్‌ మీర్‌ ఉగ్రదాడి సమయంలో  పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులతో ఫోన్‌లో మాట్లాడుతూ వారికి దిశా నిర్దేశం చేశాడు. 2011లో మీర్‌పై అమెరికా కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. 2019లో ఎఫ్‌బీఐ..

ఈ లష్కరే తొయిబా కమాండర్‌ను మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా రివార్డ్స్‌ ఫర్‌ జస్టిస్‌ ప్రోగ్రామ్‌.. ఐదు మిలియన్‌ డాలర్ల బహుమతి ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *