*రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్*
*గేమింగ్ చట్టానికి సవరణ*
*ఏపీ మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు*
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఏపీ గేమింగ్ యాక్టు-1974ను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి సమ్మతి తెలిపిందని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో ఫిషరీస్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా ‘ప్రీమియం కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లను రూపాయికే ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదించిందని, వాటిని త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. *మంత్రివర్గ భేటీ నిర్ణయాలు*
* వార్షిక అద్దె విలువ ప్రకారం నిర్ధారించే ఆస్తిపన్ను స్థానంలో కొత్త విధానానికి ఆమోదం.
* రాష్ట్రంలో నాణ్యమైన పశు దాణా ఉత్పత్తి, పంపిణీ- ధరల నియంత్రణకు బిల్లు
* వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో ‘వైఎస్సార్- జగనన్న’ మెగా ఇండస్ట్రీయల్ హబ్‌కు రాయితీలు.
* అనంతపురం జిల్లా పెనుకొండలో గొర్రెల పెంపకం కేంద్రాన్ని శిక్షణ కేంద్రంగా మార్పు
* ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు
* పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం ఎస్పీవీ ఏర్పాటు
* కృష్ణా- కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ కోసం ఎస్పీవీ ఏర్పాటు
* రూ.776.5 కోట్లతో డ్యామ్‌ల రీహాబిలిటేషన్, ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు 2, 3కు ఆమోదం. ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు.
* సోమశిల- కండలేరు కాల్వ సామర్థ్యాన్ని 12 వేల నుంచి 24 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టేందుకు ఆమోదం. 45 కిలోమీటర్ల కాల్వ పనులు, రెండు వంతెనలు సహా పలు పనులకు రూ.918 కోట్లు వ్యయం.
* నాగార్జునసాగర్ సమీపంలోని విజయపురి సౌత్‌లో గురుకుల డిగ్రీ కళాశాల, ఇతర అవసరాలకు 21 ఎకరాల భూమిని విద్యాశాఖకు కేటాయింపు
* విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండిలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల కోసం 105.32 ఎకరాల ప్రభుత్వ భూమి జేఎన్‌టీయూ-కాకినాడకు అప్పగింత
* అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో పది టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు చర్యలు. ముంపు బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రూ.240.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం. 4 గ్రామాల పరిధిలోని 1,729 కుటుంబాల్లోని నిర్వాసితులకు పరిహారం
* ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ నార్త్‌ఫీడర్ కాలువ విస్తరణ పనులకు ఆమోదం. రూ.632 కోట్లతో సుమారు 100 కిలోమీటర్ల మేర కాల్వ సామర్థ్యం పెంపు.
* ఏపీ వ్యవసాయ భూమి చట్టం (వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి) సవరణ కోసం ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం. 2006 నాటి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.