కౌంటింగ్‌పై ఉదాసీనత వద్దు
ప్రతి కేంద్రం ఓట్ల లెక్కింపూ కీలకమే
మంత్రులదే సమన్వయం: కేసీఆర్
లోక్‌సభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అఽధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎలాగూ గెలుస్తామనే విశ్వాసంతో కౌంటింగ్ ప్రక్రియ విషయంలో ఉదాసీనత తగదని
హెచ్చరించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో బుధవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. టీఆర్‌ఎస్ తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారంతా ఓట్ల లెక్కింపు ప్రారంభానికి చాలా ముందుగానే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. నాలుగైదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పిదప గెలుపు ఖాయమనుకొని, ఆ తర్వాత రౌండ్ల ఓట్ల లెక్కింపు పరిశీలనలో నిరాసక్తత ప్రదర్శించవద్దని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ ఓట్ల లెక్కింపు కూడా కీలకమేనని తెలిపారు. ఓట్ల లెక్కింపులో ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పార్టీ ఎమ్మెల్యేలు, లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో ఓట్ల లెక్కింపు పరిశీలనను మంత్రులు, అభ్యర్థులతో కలిసి సమన్వయం చేసుకోవాలన్నారు.
ఢిల్లీ పరిణామాలపై ఆరా
లోక్‌సభ సాధారణ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న నేపథ్యంలో రాజకీయంగా ఢిల్లీ స్థాయులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చిన అనంతరం జాతీయంగా ఎన్డీయే, యూపీఏ కూటముల కదలికలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతాయనే విషయంలో ఆయన ఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ముఖ్యులతో సీఎం కేసీఆర్ బుధవారం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత జాతీయస్థాయిలో రాజకీయంగా టీఆర్‌ఎస్ పోషించే పాత్రపై స్పష్టత వస్తుందని పార్టీ అధిష్ఠానం ముఖ్యులు చెబుతున్నారు.