Teluguwonders:
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పొదుపు సంఘాల మహిళల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన 1020 కోట్ల రుపాయలను అక్టోబర్ 2 వ తేదీ లోపు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ నెల వరకు మహిళల అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలను బ్యాంకులలో జమ చేయనున్నారు.
ఏ డ్వాక్రా సంఘానికి ఎంత మొత్తంలో ప్రభుత్వం జీరో వడ్డీ కింద చెల్లించారో ఆ రశీదులను వాలంటీర్లు డ్వాక్రా మహిళలకు అందజేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీ వరకు ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలను నాలుగు విడతలుగా వచ్చే ఏడాది నుండి ప్రభుత్వం అందించబోతుంది.
బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించేలా సున్నా వడ్డీలకే రుణాల విప్లవం తీసుకురాబోతుంది వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఐదు నెలల వడ్డీని అక్టోబర్ 2 వ తేదీ లోపు బ్యాంకులలో జమ చేయనుంది.
బ్యాంకర్ల సంఘాలు ఇచ్చిన వివరాల ప్రకారం 27,168 కోట్ల రుపాయలు ఏప్రిల్ 11 వ తేదీ నాటికి బ్యాంకుల్లో పొదుపు సంఘాల అప్పులుగా ఉన్నాయి. మెప్మా మరియు సెర్ఫ్ అధికారులు రాష్ట్రం అంతా డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశాలను నిర్వహించి, డ్వాక్రా సంఘాలకు ఉన్న అప్పులను తీర్మానం చేయించి బ్యాంకు అధికారుల ద్వారా ఆ వివరాలను సర్టిఫై చేయిస్తున్నారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా ఈ సమావేశాల నిర్వహణ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.
సెర్ఫ్, మెప్మా అధికారులు డ్వాక్రా సంఘాల వారీగా డ్వాక్రా సంఘాలకు ఉన్న అప్పు, ఆ అప్పుకు డ్వాక్రా సంఘాల మహిళలు ప్రతి నెలలో చెల్లించాల్సిన వడ్డీ వివరాలను మరియు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ రూపంలో చెల్లించిన రశీదులను నమోదు చేయటం కొరకు పాస్ పుస్తకాలను తయారు చేస్తున్నారు. ఈ పాస్ పుస్తకాలను డ్వాక్రా సంఘాల మహిళలకు అందజేసి ప్రభుత్వం చెల్లించిన సున్నా వడ్డీ రశీదులను పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.