Teluguwonders:
వైసిపిలో తాజాగా జాయిన్ అయిన విశాఖపట్నం డైరీ ప్రముఖులను చూస్తే ఇదే అనుమానం వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కొడుకు అడారి ఆనందకుమార్ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా అనకాపల్లి ఎంపిగా పోటి చేశారు. చాలామంది టిడిపి అభ్యర్ధులు ఓడిపోయినట్లే ఈయన కూడా ఓడిపోయారు. ఆదివారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోదరి రమాకుమారి, డైరీ బోర్డు డైరెక్టర్లతో కలిసి వైసిపి కండువా కప్పుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అడారి ఓడిపోవటంలో రెండు విధాల మైనసులున్నాయి. అదేమిటంటే మొదటిదేమో చంద్రబాబునాయుడు పాలనపై రాష్ట్రం వ్యాప్తంగా పెరిగిపోయిన వ్యతిరేకత. రెండోది విశాఖపట్నం డైరీ పరిధిలోని రైతుల్లో అడారి కుటుంబంపై పెరిగిపోయిన వ్యతిరేకత.
మొదటి కారణం చాలామంది అభ్యర్ధులపైన పడితే రెండో కారణం అడారి ఆనందకుమార్ కు అదనపు మైనస్ అనే చెప్పాలి. డైరీ పరిపాలనలో కానీ ఇతరత్రా వ్యవహారాల్లో కానీ అడారి కుటుంబానిదే దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం అని అందరికీ తెలిసిందే. దీని కారణంగానే తులసీరావు ఆధిపత్యంలో ఎలావుందో తెలీదు కానీ చేతులు మారేటప్పటికి బాగా మార్పులు వచ్చేశాయని సమాచారం. కొడుకు అడారి ఆనందకుమార్ చేతిలోకి పగ్గాలు వచ్చేటప్పటికి నిధుల దుర్వినియోగం పెద్ద సమస్యగా మారిందట.
రైతులకు సరైన ధరలు చెల్లించకపోవటం, ఫిక్స్ అయిన ధరలు కూడా సరైన సమయానికి ఇవ్వకపోవటం, రైతుల డబ్బుతో ముంబాయి, హైదరాబాద్ లాంటి చోట్ల గెస్ట్ హౌస్ లు కట్టుకుని జల్సాలు చేయటం లాంటి అనేక ఆరోపణలు ఆనంద్ పై ఉన్నాయి. ఇటువంటి అనేక కారణాలు కూడా తోడవ్వటంతో మొన్నటి ఎన్నికల్లో రైతుల్లో ఎక్కువమంది వ్యతిరేకంగా ఓటువేయటంతో ఆనంద్ ఓడిపోయారు.
అలాంటిది మూడు నెలల్లోనే అడారి టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోయారు. తమ అక్రమాలపై ప్రభుత్వం ఎక్కడ విచారణ జరుపుతుందో అన్న భయంతోనే అడారి కుంటుంబం పార్టీ మారిపోయిందనే ప్రచారం జిల్లాలో బాగా జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ట్రాక్ రికార్డు సరిగా లేని ఇటువంటి వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు ఉందా అని ?
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.