Latest

    వరద బాధితులకు నష్ట పరిహారం ఒకటే ఇస్తే సరిపోదు:సీ. ఎం జగన్

    Teluguwonders:

    సీ. ఎం.జగన్‌ వరద ముంపు గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేసారు. తక్షణ సాయంపై మంత్రులు, అధికారులతో సమీక్ష చేసారు.

    🔴ఒక్కో కుటుంబానికి రూ.5వేలు :

    గోదావరిలో వరద నీరు పెరగడంతో ముంపునకు గురైన గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటు అదనంగా ఆయా కుటుంబాలకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. ఇళ్లు, పంట నష్టపోయిన నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు.

    ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకనే ప్రత్యేకంగా ఈ రూ.5వేలు సహాయం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. మానవతా దృక్పథంతో గిరిజనులను ఆదుకోవాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

    🔴ఉచితంగా విత్తనాలు కూడా:

    ముంపునకు గురైన గ్రామాలకే కాకుండా వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాలకూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం మాత్రమే కాకుండా ఉచితంగా విత్తనాలను కూడా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు కూడా వరదల కారణంగా దెబ్బతింటే.. అక్కడున్న వారికీ పరిహారంతో పాటు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఏటీసీ టవర్‌ భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్లనాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్‌కుమార్‌ యాదవ్, రంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, పాల్గొన్నారు.

    🔴 అందుకే వరద పెరిగింది:

    ఎమ్మెల్యేలు ధవళేశ్వరంకు ఎగువన ఉన్న దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం అడిగితెలుసుకున్నారు. గోదావరిలో 10-11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేదికాదని.. కానీ, ఈసారి ముంపు ఎక్కువగా ఉందని ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం జగన్‌కు చెప్పారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ముంపు పెరిగిందని పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు తెలిపారు.

    🔴ధవళేశ్వరం కాదు పోలవరం :

    ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా పోలవరం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణంగా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా తగిన ప్రణాళిక వేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వచ్చే వరద, ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఆమేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని ఆదేశించారు. త్వరగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమిస్తున్నట్టు సీఎం చెప్పారు. తక్షణమే ఆ అధికారి బాధ్యతలు తీసుకుని పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేస్తారన్నారు.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading