Teluguwonders:
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతీ నగరం, ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామం, ప్రతీ గల్లీలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎర్రకోటపై మోడీ జెండాను ఆవిష్కరించడం ఇదో ఆరోసారి కావడం విశేషం. ఎర్రకోటకు చేరుకోక ముందు రాజ్‌ఘాట్ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన మోడీ.. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట దగ్గరకు చేరుకుని త్రివిధ దళాలు గౌరవవందనం స్వీకరించారు.
గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టామని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలోకి తెచ్చామని చెప్పారు. సాగునీటి వనరుల అభివృద్ధికి జలశక్తి అభియాన్ తీసుకువచ్చామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన పదినెలల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. 70 ఏళ్లలో చేయలేని పనులను తాము 70 రోజుల్లోనే పనిచేశామని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలకు రక్షాభందన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని అన్నారు.
ఒక దేశం ఒకే రాజ్యాంగం తన ధ్యేయమని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తే తనకు ముఖ్యమని రాజకీయ భవిష్యత్ తనకు అవసరం లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే రాజ్యాంగాన్ని సాధించామని, త్వరలోనే వన్ నేషన్-వన్ పోల్ సాకారమవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు పేదలను ఓటుబ్యాంకుగా వాడుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలోనే సబ్ కా వికాస్ సాధ్యమైందని అన్నారు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. వరదలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయని, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని చెప్పారు
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.