కాంగ్రెస్ అధినేత గా.. మళ్ళీ సోనియా గాంధీనే…

Sonia Gandhi as Congress President
Spread the love

Teluguwonders:

సీడబ్ల్యూసీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు.అధ్యక్ష బాధ్యతలను మళ్లీ సోనియా గాంధీకే అప్పగించారు.

💥కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా గాంధీ నే పాలించబోతున్నారు.
అనారోగ్యం వేధిస్తున్నా పార్టీ కోసం బాధ్యతలు చేపట్టిన ధీశాలి ఆవిడ.

కాంగ్రెస్‌ పార్టీ కొత్త సారథి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరవీడింది. సోనియా గాంధీకి పార్టీ పగ్గాలను అప్పగిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ సీడబ్ల్యూసీలో పార్టీ సీనియర్ నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎన్నుకున్నట్లు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ గాంధీ అంగీకరించకపోవడంతో సోనియాకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి ముందు సోనియా గాంధీ సుమారు 19 ఏళ్లు కాంగ్రెస్ సారథిగా కొనసాగి రికార్డు సృష్టించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆపద్భాందవుడి పాత్ర పోషించారు. 2017లో అనారోగ్యం తదితర కారణాలతో ఆ బాధ్యతలను తన కుమారుడు రాహుల్‌కు అప్పగించారు. అయితే.. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
శనివారం (ఆగస్టు 10) సీడబ్ల్యూసీ సమావేశం సుదీర్ఘంగా 8 గంటలకు పైగా జరిగింది. ఢిల్లీలోని కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కొత్త సారథి అంశంపై తీవ్ర కసరత్తు చేశారు. రాహుల్ గాంధీ తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని నేతలంతా కోరారు. కానీ, పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.

🔴కీలక చర్చ:

శనివారం ఉదయం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ గాంధీ మళ్లీ ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ నేతలంతా ఏక వాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే.. ఆయన అందుకు ససేమిరా అన్నారు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు 5 కమిటీలను ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల నేతల అభిప్రాయాలు తీసుకొని ఐదు కమిటీలు నివేదికలను సిద్ధం చేశాయి. ఆ నివేదికల ఆధారంగా సీడబ్ల్యూసీలో కీలక చర్చ జరిగింది.
సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపికపై చర్చించాలని కమిటీ సభ్యులకు సూచించి.. సోనియా, రాహుల్‌ సమావేశం నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత సీడబ్ల్యూసీలో జమ్ము-కశ్మీర్‌ అంశంపై చర్చకు రావాలని సీడబ్ల్యూసీ సభ్యులు కోరడంతో రాహుల్‌ మళ్లీ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రియాంకా గాంధీ, గులాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, చిదంబరం, అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. అయితే.. కాస్త ముందుగానే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికతో పాటు సమావేశంలో పలు సమస్యలపై చర్చించినట్లు నేతలు తెలిపారు.

🔴జమ్ము కశ్మీర్ లో ఏం జరుగుతుంది -రాహుల్ :

సీడబ్ల్యూసీ భేటీ సందర్భం గా రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘జమ్ము-కశ్మీర్‌ ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారు. జమ్ము కశ్మీర్‌పై కేంద్రం తీసుకునే ప్రతినిర్ణయం పాదర్శకంగా ఉండాలి. సీడబ్ల్యూసీలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది..జమ్ము-కశ్మీర్‌లో ఏం జరుగుతుందో ప్రధాని.. ప్రజలకు జవాబు చెప్పాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు’ .

💥సోనియా గాంధీకే కాంగ్రెస్ బాధ్యతలు :

పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని..పార్టీ బాధ్యతలను మరో వ్యక్తికి అప్పగిస్తే చీలిపోయే ప్రమాదం ఉందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీని ఆ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఆమె ఓకే చెప్పడంతో నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని.. అలాంటి పరిస్థితుల్లోనూ పార్టీ భవిష్యత్తు కోసమే బాధ్యతలు మోయడానికి అంగీకరించానని పార్టీ నేతలతో సోనియా గాంధీ అన్నట్లు తెలుస్తోంది.అయితే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తాత్కాలికంగానే కొనసాగే అవశాకాలు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. త్వరలో మరోసారి సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading