మోదీ, జిన్పింగ్ భేటీ మహాబలిపురంలోనే ఎందుకు?

Spread the love

మోదీ, జిన్పింగ్ మహాబలిపురంలో భేటీ అవుతున్నారు. వీరిద్దరి అనధికారిక సమావేశానికి మహాబలిపురం ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రాచీన కాలంలో చైనాతో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది.

రెండ్రోజుల భారత పర్యటన కోసం చైనా అధినేత జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురంలో సమావేశం అవుతున్నారు. వీరిద్దరూ అనధికారికంగా సమావేశం అవుతున్న తరుణంలో.. ఇద్దరు నేతల మధ్య భేటీకి మహాబలిపురాన్నే కేంద్రం ఎందుకు ఎంచుకుందో తెలుసుకోవడం కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పురావస్తు ఆధారాలను పరిశీలిస్తే.. ప్రాచీన కాలం నాటి నుంచే చైనాతో మామల్లపురం (నేటి మహాబలిపురం) సంబంధాలు ఉన్నాయి.
2000 ఏళ్ల క్రితం నుంచే మామల్లపురం, చైనా మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే కాలానికి చెందిన చైనా నాణేలు తమిళనాడులో లభ్యమయ్యాయి. చైనాలోనూ తమిళ శాసనాలు దొరికాయి. కాంచీపురాన్ని చైనాలో “హువాంగ్-చే”గా పిలుస్తారు.

మహాబలిపురం: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత ప్రధాని తమిళ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

ప్రత్యేక సందర్భాల్లో వెరైటీ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకునే ప్రధాని మోదీ.. మహాబలిపురం పర్యటనలో పంచెకట్టుతో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ.. తమిళ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. పంచెకట్టుతో మహాబలిపురానికి చేరుకున్న మోదీ.. అక్కడి శోర్‌ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం జిన్‌పింగ్‌‌తో కలిసి అక్కడి చారిత్రక కట్టడాలను వీక్షించారు.

మామల్లపురం (మహాబలిపురం)లో వెయ్యేళ్ల నాటి చారిత్రక కట్టడాలను మోదీ, జిన్‌పింగ్ వీక్షించారు. మహాబలిపురం చారిత్రక ప్రాధాన్యాన్ని, విశేషాలను జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. రెడ్‌కార్పెట్‌పై ఇద్దరూ న‌డుస్తూ మహాబలిపురం చ‌రిత్ర గురించి చ‌ర్చించుకున్నారు. అక్కడి యునెస్కో వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌ను సంద‌ర్శించారు. గుహ‌ల్లో కాసేపు తిరిగారు.

కొబ్బరి నీళ్లు తాగుతూ సరదాగా కబుర్లు..


పంచ రథాలు, అర్జునుడు త‌ప‌స్సు చేసినట్లుగా చెబుతున్న ప్రదేశం, షోర్ ఆల‌యాల‌ను ఇరువురు దేశాధినేతలు వీక్షించారు. కృష్ణుడి వెన్నముద్దగా పేర్కొనే ఓ భారీ రాయి ముందు మోదీ, జిన్‌పింగ్ ఫోటోలకు ఫోజిచ్చారు. అనంతరం అక్కడి లాన్‌లో కూర్చొని కొబ్బరి నీళ్లు తాగుతూ సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు.

అంతకుముందు చెన్నై విమానాశ్రయంలో చైనా అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. అనంతరం గ్రాండ్ చోళా హోట‌ల్ చేరుకున్న జిన్‌పింగ్.. కాసేపటి తర్వాత రోడ్డు మార్గాన మహాబలిపురం బయల్దేరారు. 50 కిలోమీట‌ర్ల దూరం కారులో ప్రయాణించి మహాబలిపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా గుమిగూడిన వేలాది మంది జిన్‌పింగ్‌కు స్వాగ‌తం ప‌లికారు. సుమారు రెండు వేల మంది చిన్నారులు జిన్‌పింగ్ మాస్క్‌లు ధ‌రించి.. చైనా అధ్యక్షుడికి స్వాగ‌తం ప‌లికారు. మోదీ, జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో మహాబలిపురంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading