Teluguwonders:
అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలోని కియ కార్ల పరిశ్రమ నుంచి తయారైన తొలికారు సెల్టోస్‌ను గురువారం ఆవిష్కరించింది. 👉 సీఎం సందేశాన్ని వినిపించిన బుగ్గన : .ఈ సందర్భంగా, సీఎం సందేశాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా రావాల్సి ఉన్నా, గోదావరి వరద బాధితులకు అక్కడ జరుగుతున్న రక్షణ ఏర్పాట్లు పరిశీలించడం ముఖ్యమైనందున రాలేకపోయానని ఆ సందేశంలో జగన్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన, శంకరనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్‌కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం సందేశాన్ని బుగ్గన పూర్తిగా చదివారు. అందులో ఏమున్నదంటే. ‘‘అందరికీ వాగ్దానం చేస్తున్నా. అనంతపురం జిల్లాకు మరిన్ని పరిశ్రమలు త్వరలోనే వస్తాయ్. కియ కార్ల పరిశ్రమకు అనుబంధంగా చాలా పరిశ్రమలు పెడతామంటూ పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. కియ పరిశ్రమను ఆంధ్రాలో, అందులోనూ అనంతపురంలో ఏర్పాటు చేసి వైఎస్ మాటకు కంపెనీ నిర్వాహకులు విలువ ఇచ్చారు. నాడు ఆయన వేసిన విత్తనం నేడు వృక్షంగా మారడం చాలా సంతోషం.
కొత్త చాలెంజ్‌లకు కియ సాక్ష్యంగా నిలుస్తుంది. కొత్త సవాళ్లను ఎదుర్కొంటామని చాటుతోంది. కియ పరిశ్రమలో తయారైన సెల్టోస్ కారే దీనికి నిదర్శనం. ప్రారంభం రోజునే ఆరు వేల మంది బుకింగ్ చేసుకోవడం పెద్ద రికార్డు. ఇది అభినందనీయం. కియ పరిశ్రమకు అనుబంధంగా విడి భాగాలు సరఫరా చేస్తామంటూ పలువురు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కియకు సంబంధించిన సమస్యలపై సత్వరంగా స్పందిస్తామని పరిశ్రమ ఎమ్‌డీ షిక్‌కు హామీ ఇస్తున్నా. పారిశ్రామికాభివృద్ధి దిశగా రాష్ట్రం కదులుతోంది. మూడు పారిశ్రామిక కారిడార్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎలక్ర్టిక్ వాహనాల తయారీకి ప్రాధాన్యమిస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ర్టిక్ బస్సులను తీసుకొచ్చి రికార్డు సృష్టించనున్నాం. ఉద్యోగులకు ఎలక్ర్టిక్ బస్సుల నిర్వహణపై అవగాహన కల్పిస్తాం’’ అని జగన్ స్పష్టం చేశారు.
🔴మంత్రి శంకరనారాయణ వ్యాఖ్య :
భారతదేశంలో తొలి కియ ప్లాంటు తమ నియోజకవర్గంలో ఏర్పాటు కావడం అదృష్టమని అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకరనారాయణ అన్నారు.
🔴 ‘కియ’ ఒక ఆశాకిరణం – రోజా :
నిరుద్యోగులకు ఆశాకిరణంలా ‘కియ’ ఏర్పాటయిందని ఏపీఐఐసీ చైర్మన్ రోజా అన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు వచ్చేలా అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కియ యాజమాన్యం కూడా పాటించాలని కోరారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయిన మాజీ మంత్రి లోకేశ్ తమను విమర్శించడం ఏమిటని రోజా మీడియా వద్ద వ్యాఖ్యానించారు.
🔶సీ. ఎం.సహకారం మాకెప్పుడూ ఉండాలి- కియా మోటార్స్ అధినేత:
‘‘ఆంధ్రా సీఎం యువకుడు. ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచారు. ఆయన సహకారం మాకెప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాం. రెండు దశాబ్దాల క్రితమే హుండయ్ కంపెనీ ఇక్కడకు వచ్చింది. అది చాలా మంచిపేరు సంపాదించుకుంది. దాని సిస్టర్ కంపెనీగా కియ కూడా అనంతపురంలో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది మాకు ఆనందదాయకం’’ అని కియా మోటార్స్ అధినేత వివరించారు
🔴నాన్న గారి కల నిజమైంది :
కియ పరిశ్రమ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విజన్. 2007లో అప్పటి హుండయ్ ముఖ్య అధికారితో వైఎస్ రాష్ట్రంలో కార్ల పరిశ్రమ పెట్టే అంశాన్ని చర్చించారు. ఆ మాట ఇప్పుడు నిజమైంది. ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆ సంస్థకు పంపిన సందేశంలో వ్యాఖ్యానించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.