*2.20 లక్షల వ్యాజ్యాలు.. 13 మంది న్యాయమూర్తులు.
*ఈ పరిస్థితుల్లో సత్వర విచారణ సాధ్యం కాదు.
*విశ్రాంత జడ్జీల సేవలను వినియోగించుకునేలా ఆదేశించండి
*హైకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం.
*న్యాయవాదుల ఉపాధీ దెబ్బతింటోందని ఆవేదన.
హైదరాబాద్: హైకోర్టులో కేసుల విచారణ నిమిత్తం విశ్రాంత న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న వ్యాజ్యాలతో పోలిస్తే న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో వీటి పరిష్కారం అసాధ్యమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలోని అధికరణ 224-ఎ ప్రకారం ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రపతి ఆమోదంతో విశ్రాంత న్యాయమూర్తుల సేవలను వినియోగించుకోవచ్చని గుర్తుచేస్తూ, ఆ దిశగా ఆదేశాలివ్వాలని కోరారు. ‘‘హైకోర్టులో నవంబరు 30 నాటికి 2,20,291 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.
ఇందులోసివిల్ వ్యాజ్యాలు 1.88లక్షలు, మిగిలినవి క్రిమినల్ వ్యాజ్యాలు. ఈ ఏడాది జనవరినుంచి నవంబరు 30వరకు 20,385 కేసులు పరిష్కారంకాగా, కొత్తగా 34,863 విచారణకు వచ్చాయి.
ఈఏడాది ప్రారంభంలో 2.06లక్షల పిటిషన్లు అపరిష్కృతంగా ఉండగా, నవంబరు నాటికి ఆ సంఖ్య 2.20లక్షలకు చేరుకుంది. కోర్టు ధిక్కరణ కేసులే 6,240 ఉన్నాయి. తెలంగాణ హైకోర్టుకు 24 న్యాయమూర్తుల పోస్టులు మంజూరైతే, ఇప్పుడు కేవలం 13 మందే పనిచేస్తున్నారు. ఈ సంఖ్యతో కేసుల సత్వర విచారణ సాధ్యం కాదని భావిస్తున్నా.
తమ వ్యాజ్యాలు సకాలంలో పరిష్కారానికి నోచుకోకపోవడంతో పిటిషన్‌దారులు వాటి కొనసాగింపునకు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల న్యాయవాదుల ఉపాధీ దెబ్బతింటోంది’ అని ఆయన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
హైకోర్టుకు రెగ్యులర్ న్యాయమూర్తులను నియమించాలంటూ గతంలో పిటిషన్ దాఖలు చేశానని, కొత్త నియామకాలు జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తంచేస్తూ పిటిషన్‌ను కొట్టివేయగా, సుప్రీంకోర్టును ఆశ్రయించానని ఆయన గుర్తుచేశారు. అదింకా పెండింగ్‌లో ఉందని, నియామకాలు మాత్రం చేపట్టలేదన్నారు. ఈ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగం కల్పించిన అవకాశంతో విశ్రాంత న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు.
ఇందులో ప్రతివాదులుగా కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సుప్రీం కోర్టు తరఫున సెక్రటరీ జనరల్, హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.