25 ఏళ్ల క్రితం ఓ సెల్ చేతిలో ఉందంటే.. అది ఎంతో గొప్పగా భావించేవారు. అప్పట్లో కేవలం కొందరు ప్రముఖుల దగ్గరే సెల్ ఉండేది. అలాంటి వారిలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఒకరు. ఓ సమయంలో ఆయన దగ్గర ఉన్న ఫోన్ సినిమా సెట్లోని వ్యక్తుల్ని ఎలా గందరగోళానికి గురి చేసిందో దర్శకుడు తులసీదాస్ వివరించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆయిరం నావుల్ల అనంతన్’. గౌతమి, మాధవి, దేవన్, మురళి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సెట్లో జరిగిన విచిత్ర ఘటన గురించి తులసీదాస్ తాజాగా చెబుతూ.. ‘సినిమా షురూ అయ్యింది. మమ్ముట్టి మోటొరోలా హ్యాండ్‌సెట్‌తో సెట్‌కు వచ్చారు. అప్పట్లో అది ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో అతి తక్కువ మంది దగ్గర సెల్ ఉండేది. సెట్లో అందరూ మమ్ముట్టి మొబైల్ గురించే చర్చించుకునేవారు. తర్వాత కొన్ని రోజులకు గౌతమి ఓ మొబైల్ కొని, తీసుకొచ్చారు. ఆపై మాధవి ఒకటి, దేవన్ ఒకటి సెట్‌కు తీసుకొచ్చారు. కానీ నటుడు మురళీ దగ్గర ఫోన్ లేదు’.
‘కొన్ని సందర్భాల్లో కెమెరా రోల్ అయిన తర్వాత దూరంగా పెట్టి ఉన్న మొబైల్ రింగ్ అయ్యేది. నటులు యాక్టింగ్ ఆపేసి, వెళ్లి ఫోన్ ఎత్తి మాట్లాడేవారు. షూట్ ఆగడంతో గందరగోళంగా ఉండేది. ఇవన్నీ మురళీకి నచ్చేది కాదు. నన్ను పక్కకు పిలిచి.. మరోసారి ఇలా జరిగితే నేను వెళ్లిపోతా అన్నాడు. అతడికి సర్దిచెప్పడానికి చాలా కష్టపడ్డా. చివరికి పరిస్థితి చక్కబడింది. షూటింగ్ కొనసాగింది’ అని తులసీదాస్ చెప్పారు.అదండీ ఫోన్ వచ్చిన కొత్తలో అక్కడ హడావిడి..