ప్రముఖ నటుడు, డ్యాన్స్ డైరెక్టర్ రాళ్లపల్లి ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన సుమారు 850పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి వార్తతో పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణానికి సంతాపం తెలిపారు.
⚫రాళ్ళపల్లి గురించి వివారాల్లోకి వెళితే :
రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. 1945 ఆగస్టు 15న జన్మించారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు. అలాగే 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో అద్భుతమైన ప్రతిభకు ఉత్తమ కామెడీ నటుడిగా జాతీయ అవార్డును అందుకొన్నారు. గణపతి అనే సీరియల్‌లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు.
⚫1979లో నటజీవితం ప్రారంభం:
1979లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ చిత్రంతో రాళ్లపల్లి నట జీవితాన్ని ప్రారంభించారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించారు. బొంబాయి, మిన్సారా కన్నవు అనే తమిళ చిత్రాలు ,అన్వేషణ,లేడీస్ టైలర్ మొదలైన చిత్రాలు చూసిన వారు ఆయనను ఎప్పటికీ మర్చిపోరు.ఆ సినిమాలు ఆయనకు ఎంతో మంచి పేరు ను తెచ్చిపెట్టాయి. ఆయన కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించారు.
⚫రాళ్లపల్లి నటించిన ముఖ్యమైన చిత్రాలు :
తూర్పు వెళ్లే రైలు, సీతాకోక చిలుక, శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అన్వేషణ, కూలీ నెంబర్ 1, ఏప్రిల్ ఒకటి విడుదల లాంటి హిట్ సినిమాల్లో కీలక పాత్రలను పోషించారు. ఆయన నటించిన చివరి చిత్రం భలే భలే మొగాడివోయ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015లో విడుదలైంది.
♦హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ :
హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని తన నివాసానికి తరలిస్తాం అని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రముఖులు పార్దీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. మా సభ్యులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఓ కుమార్తె ఇప్పటికే స్వర్గస్తులయ్యారు. మరో కుమార్తె అమెరికాలో ఉన్నారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకొన్న తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.