1..2..3..4..5 కాదు 28 ఏళ్ల నాటి కల. అవును! టీమిండియా రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలన్నది శతకోటి భారతీయుల 28 ఏళ్ల నాటి కల. 2011లో సొంతగడ్డపై లీగ్‌దశను దాటి క్వార్టర్ ఫైనల్ చేరింది ధోనీసేన. ఫైనల్ చేరే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ అది. ప్రత్యర్థేమో పసికూన కాదు. నాలుగు సార్లు విశ్వవిజేత. భీకరమైన ఆస్ట్రేలియా. 2003 ఫైనల్లో భారత భంగపాటు పదేపదే కలవరపాటు కలిగిస్తోంది. ఒత్తిడి కొర కొరా చంపేస్తోంది. ఆసీస్‌తో పోరు కంగారు పెడుతోంది. ఛేదనలో 187/5తో దాదాపు చేజారిపోయే మ్యాచ్‌ను మళ్లీ మనవైపు తిప్పింది ‘యువ రాజసం’. యువీ అద్వితీయ పోరాట పటిమతో విజయ దరహాసం చేశాడు.
ధోనీసేన మీసం మెలేశాడు. ప్రపంచకప్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిన ఈ సమరాన్ని మరొక్కసారి తలచుకుందాం!!
దాయాది పిలుపు
చివరి లీగ్‌లో వెస్టిండీస్‌ను 80 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఊపుమీదుంది. క్వార్టర్స్‌లో ఆసీస్‌తో పోరుకు సై అంటోంది. అప్పటికే దాయాది పాకిస్థాన్ సెమీస్ చేరి కవ్విస్తోంది. ధోనీసేన నిజానికి రెండు జట్లతో మానసిక యుద్ధం చేస్తోందప్పుడు. ఓ వైపు డిఫెండింగ్ ఛాంపియన్. మరోవైపు శాశ్వత శత్రువు. ట్రోఫీ కావాలంటే భారత్, ఆసీస్‌కు ఇది చావోరేవో మ్యాచ్. మరోవైపు దిగ్గజాలు సచిన్, పాంటింగ్ భవితవ్యానికి నిర్ణయాత్మకం కావడం, ఆటగాళ్లు, అభిమానులు ఉద్వేగంతో ఊగిపోతుండటం వల్ల వాతావరణం ఒత్తిడితో నిండింది. 2003 ఫైనల్లో కంగారూల చేతిలో పరాభవం గుర్తొచ్చినప్పుడల్లా కాస్త భయం కలుగుతోంది. అయితే హెడేన్, గిల్‌క్రిస్ట్, మెక్‌గ్రాత్ వీడ్కోలు పలకడం, మ్యాచ్‌కు ముందే గెలిచేశామన్నంత ధీమాతో ఉండే ఆసీస్‌లో బలహీనత టీమిండియాకు బలాన్నిచ్చాయి. కానీ బ్రెట్‌లీ, మిచెల్ జాన్సన్, షేన్ వాట్సన్, బ్రాడ్ హడిన్, పాంటింగ్‌ను తక్కువ అంచనా వేయలేం. స్లో బౌన్సర్లతో ధోనీసేనను దెబ్బతీయాలన్నది ఆసీస్ ప్రణాళిక. వీరూ, సచిన్‌ను పరుగులు చేయనివ్వకుండా, కుర్రాళ్లను త్వరగా ఔట్ చేయడం ద్వారా ఒత్తిడి చేయాలన్నది ప్రత్యర్థి మరో వ్యూహం. భారత్ మాత్రం స్పిన్‌ను నమ్ముకుంది. వీరూ, సచిన్ అనుభవం, గంభీర్ ఫామ్‌పై నమ్మకం ఉంది. 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న యువీ ఆదుకుంటాడన్న భరోసాతో ధోనీసేన యుద్ధరంగంలోకి దిగింది.
కంగారు..కంగారూ..
లక్ష్యం 261. భీకరమైన ఆసీస్‌పై ఛేదన అంత సులభమేమీ కాదు. ముందే రక్షణాత్మకంగా ఆడితే కంగారూలు ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. సచిన్ (53; 68 బంతుల్లో 7×4) దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ సెహ్వాగ్ (15; 22 బంతుల్లో 2×4) అతడికి సహకారం అందించాడు. వీరిద్దరూ 8 ఓవర్ల వరకు వికెట్ పడకుండా శుభారంభం అందించారు. స్కోరు 44 వద్ద వీరూ వెనుదిరిగినా గంభీర్ (50; 64 బంతుల్లో 7×4)తో కలిసి సచిన్ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కుడి, ఎడమ భాగస్వామ్యంతో వీరిద్దరూ ఆసీస్‌ను ఇబ్బంది పెట్టారు. జట్టు స్కోరు 94 వద్ద సచిన్‌ను ఓ అద్భుతమైన బంతికి టెయిట్ పెవిలియన్ పంపించాడు. అంతే కంగారూ శిబిరంలో ఆనందం మొదలైంది. అప్పుడు మొదలైంది అసలు కథ. బ్రెట్ లీ స్లో బౌన్సర్లతో గంభీర్, విరాట్ కోహ్లీ (24)ను తెగ ఇబ్బంది పెట్టాడు. సచిన్ నిష్ర్కమణ తర్వాత దాదాపు 10 ఓవర్ల వరకు బౌండరీ రాలేదు. ఈ క్రమంలో పుంజుకున్న టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 143 వద్ద 28.3వ బంతికి విరాట్‌ను హస్సీ ఔట్ చేశాడు. యువరాజ్ (57; 65 బంతుల్లో 8×4)తో సమన్వయ లోపం వల్ల గంభీర్ 34వ ఓవర్‌లో రనౌట్ అయ్యాడు. అప్పటికే రెండు సార్లు తప్పించుకున్న అతడిపై కంగారూలు మూడోసారి కనికరం చూపలేదు. అప్పుడు స్కోరు 168. దురదృష్ట వశాత్తు 187 వద్ద బ్రెట్‌లీ బౌలింగ్‌లో ఎంఎస్ ధోనీ (7)నీ లీనే ఔట్ చేసేశాడు. మిడిలార్డర్ కూలిపోవడంతో విజయం భారత్‌కు దూరమయ్యేలా కనిపించింది.
యువీ సింహగర్జన
విజయానికి 75 బంతుల్లో 74 పరుగులు కావాలి. ధోనీ నిష్ర్కమణతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పులు పెట్టేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. క్రీజులో యువీ ఉన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ వచ్చేదేమో సురేశ్ రైనా. యువకుడు. టీమిండియా ఆశల్ని కబళించేందుకు కదం తొక్కుతున్నారు కంగారూలు. భీకరమైన బౌలింగ్ లైనప్. స్లో బౌన్సర్లతో విరుచుకుపడుతున్న బ్రెట్‌లీ, టెయిట్, జాన్సన్, స్పిన్నర్ క్రెజా బౌలింగ్‌లో రైనా నిలవగలడా అన్న ఓ సందేహం. ఇప్పటి వరకున్న ఫామ్‌ను యువీ కొనసాగిస్తాడా అన్న సంశయం అభిమానులకు కలిగింది. మ్యాచ్ సాగే కొద్దీ సమీకరణాలు తారుమారు అవుతున్నాయి. అయితే చక్కని స్ట్రైక్‌తో సింగిల్స్ తీస్తూ వికెట్ మాత్రం పడనివ్వలేదు ఈ జోడీ. యువీ బంతిని మైదానం నలుమూలలా పంపిస్తూ ఆసీస్ ఫీల్డర్లను ఉరికించాడు. అతడికి తోడుగా రైనా సమయోచితంగా ఆడాడు. చక్కని స్ట్రైక్ ఇచ్చాడు. వీరిద్దరూ బ్రెట్‌లీ వేసిన 40వ ఓవర్‌లో 14, టెయిట్ వేసిన 41వ ఓవర్‌లో 13 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. దాంతో ఆసీస్ బౌలింగ్ గతి తప్పింది. బంతులు గురి తప్పాయి.
షేన్ వాట్సన్ వేసిన 44.4వ బంతికి 2 పరుగులు తీసి యువీ కెరీర్‌లో 49వ అర్ధశతకం సాధించాడు. ఆ టోర్నీలో అతడికి నాలుగోది. యోధుడి తరహా పోరాటంతో అతడు 120 కోట్ల భారతీయుల ఆశలను నిలబెట్టాడు. సమీకరణం మార్చేశాడు. 46వ ఓవర్‌లో పవర్‌ప్లే తీసుకోగానే బ్రెట్‌లీ వేసిన తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు రైనా. అంతేనా జాన్సన్ వేసిన 47వ ఓవర్ తొలి బంతినీ బౌండరీకి తరలించి గెలుపు లాంఛనం చేశాడు. అదే ఓవర్‌లో భారత్‌ను విజయలక్ష్మి వరించింది. అప్పటికే క్యాన్సర్ కంతితో ఇబ్బందులు పడుతున్న యువీ అడవిలో మృగరాజులా మైదానంలో సింహగర్జన చేశాడు. అతడి గాండ్రింపులకు అభిమానుల్లోని ఉద్వేగం, ఒత్తిడి మటుమాయం అయ్యాయి. కంగారూల ముఖాలు కళ తప్పాయి.