‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

Spread the love

టైటిల్‌ : ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌
జానర్‌ : యాక్షన్‌ డ్రామా
నటీనటులు : ఆది సాయి కుమార్‌, అబ్బూరి రవి, శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌, మనోజ్‌ నందం
సంగీతం : శ్రీచరణ్ పాకాల
దర్శకత్వం : సాయికిరణ్‌ అడివి
నిర్మాతలు : ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ స్వరూప్, పద్మనాభ రెడ్డి, ఆర్టిస్ట్స్ అండ్‌ టెక్నీషియన్స్

కథ:
1980లో కశ్మీర్‌ పండిట్‌లు జమ్మూ కశ్మీర్‌ వదిలివెళ్లాలంటూ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగుతారు. ఘాజీబాబా (అబ్బూరి రవి) నేతృత్వంలోని ఓ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతుంది. పండిట్‌లను కశ్మీర్‌ నుంచి పంపించేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలనేది వారి కుట్ర. అయితే కొంతకాలం తర్వాత ఘాజీబాబా కశ్మీర్‌ను వదిలి హైదరాబాద్‌కు వస్తాడు. ఘాజీబాబా హైదరాబాద్‌కు వచ్చాడని తెలుసుకున్న ఎన్.ఎస్.జి కమాండో కెప్టెన్‌ అర్జున్‌ (ఆది‌‌) పక్కా వ్యూహంతో అతడిని అరెస్ట్‌ చేస్తాడు. ఘాజీబాబాకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష వేస్తుంది.

అయితే ఘాజీబాబాను కాపాడేందుకు అతడి ముఖ్య అనుచరుడు ఫరూఖ్‌ (మనోజ్‌ నందం) ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ ప్రారంభిస్తాడు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఏకే శర్మ (రావు రమేశ్‌) కూతురు నిత్యను కిడ్నాప్‌ చేసి భారత ప్రభుత్వాన్ని బెదిరించాలనేది ఫరూఖ్‌ ప్లాన్‌. అయితే నిత్యకు కార్తీక్‌ రాజు, తానియా, సాల్మన్‌లతో ఎలా పరిచయం ఏర్పడింది? కార్తీక్‌ రాజు, తానియాల ప్రేమ చిగురించిందా? చివరకు నిత్యను ఫరూఖ్‌ కిడ్నాప్‌ చేసి ఘాజీబాబాను విడిపిస్తాడా? ఫరూఖ్‌ను కెప్టెన్‌ అర్జున్‌ అడ్డుకుంటాడా? అనేదే మిగతా కథ.

నటీనటులు:
ఇప్పటివరకు లవర్‌ బాయ్‌గా సాఫ్ట్‌ లుక్‌లో కనిపించిన ఆది సాయి కుమార్‌ కెప్టెన్‌ ఆర్జున్‌ పాత్రలో రఫ్‌గా కనిపించాడు. కమాండో ఆపరేషన్‌లలో తన నటన, యాటిట్యూడ్‌తో మెప్పించాడు. అయితే ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్‌తో సినిమా మొత్తం కనిపిస్తాడు. ఇక తొలిసారి స్క్రీన్‌పై విలన్‌గా కనిపించిన రచయిత అబ్బూరి రవి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో మరో విలన్‌గా నటించిన మనోజ్‌ నందం తీవ్రవాదిగా అంతగా సూట్‌ కాలేదు. తన బాడీ లాంగ్వేజ్‌, యాటిట్యూడ్‌ ఏ కోణంలోనూ తీవ్రవాదికి ఉండాల్సిన లక్షణాలు కనిపించలేదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన శషా చెట్రి, నిత్య పర్వాలేదనిపించారు. కార్తీక్‌ రాజు, పార్వతీశంలు కాస్త ఎంటర్‌టైన్‌ చేసే​ ప్రయత్నం చేశారు. ఇక రావు రమేశ్‌ కేంద్ర మంత్రిగా ఒదిగిపోయాడు. కృష్ణుడు కనిపించింది కాసేపైనా చివర్లో కంటతడిపెట్టిస్తాడు. మిగతా తారాగణం వారి పాత్రల మేరకు మెప్పించారు

విశ్లేషణ:
సక్సెస్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆది.. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత వంటి సెన్సిటివ్‌ సినిమాలను తెరకెక్కించి మెప్పించిన దర్శకుడు సాయికిరణ్‌ అడివిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే సెన్సిటివ్‌ డైరెక్టర్‌గా ముద్రపడిపోయిన సాయికిరణ్‌ తీవ్రవాదం నేపథ్యం గల చిత్రాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. మంచి స్టోర్‌ లైన్‌ అయినప్పటికీ.. పూర్తి కథగా మలచడంలో రచయిత, దర్శకుడు విఫలమయ్యారు. రోటీన్‌ స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకులు విసిగిపోతారు. ఆది నటుడిగా వంద మార్కులు సాధించనప్పటికీ.. అతడికి  ఈ సినిమా బ్రేక్ ఇవ్వలేకపోయింది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల తన పాటలతో మెప్పించలేకపోయాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు కూడా అంత కొత్తగా ఏమనిపించలేదు. క్లైమాక్స్‌లో రామజోగయ్యశాస్త్రి అందించిన సాహిత్యం హార్ట్‌టచ్‌ చేసేలా ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పనితనం తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
యాక్షన్‌ సీన్స్‌
సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌
రొటీన్‌ స్క్రీన్‌ ప్లే
స్లో నేరేషన్‌
కాలేజ్‌, ప్రేమ సన్నివేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *