ప్రముఖ హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని తెలిపిన మనోజ్…విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరొకరికి గౌరవం అలాగే ఉంటుందన్నారు. అలాగే ఈ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించారు.
‘నా వ్యక్తిగత జీవితం, కేరీర్‌కు సంబంధించి కొన్ని అంశాలను మీతో పంచుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. భార్యభర్తలుగా మా ఇద్దరి ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికాం. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మేమిద్దరం కలిసి ఉన్నంతకాలం మా ప్రయాణం చాలా ఆనందంగా కొనసాగింది. మా మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో.. చాలా ఆలోచించి కష్టమైనప్పటికీ ఎవరి దారి వాళ్లు చూసుకోని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం విడిపోయినప్పటికీ..మాకు ఒకరిపై మరొకరికి గౌరవం అలాగే ఉంటుంది. మీరందరు కూడా ఈ నిర్ణయాన్ని మద్దతుగా నిలిచి మా ప్రైవసీని గౌరవిస్తారని భావిస్తున్నాను.
కొంతకాలంగా నా మనసు బాగోకపోవడంతో.. పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. అలాగే సినిమాల్లో నటించలేకపోయాను. ఈ సమయంలో నా కుటుంబం చాలా అండంగా నిలిచింది. వారు నా వెంట లేకపోతే ఈకష్టసమయాన్నిఅధిగమించలేకపోయేవాడిని. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. నాకు తెలిసిన ఏకైక పని సినిమాల్లో నటించడం.. అందుకోసం నేను తిరిగొచ్చాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా అభిమానుల వల్లే. నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే కొనసాగుతాను. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి’ అని మనోజ్ తెలిపారు. గతంలో మనోజ్ దంపతులు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చిప్పటికీ ఆయన వాటిని కొట్టిపారేశారు. కాగా, 2015లో మనోజ్, ప్రణతిరెడ్డిల వివాహం జరిగింది.