ముందుజాగ్రత్తే శ్రీరామరక్ష
స్వీయ నియంత్రణతో కరోనా కట్టడి
ప్రార్థనా మందిరాల్లోకి భక్తుల్ని అనుమతించొద్దు
ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాల రద్దు
రాష్ట్రాన్ని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం
విదేశీయుల కోసం ఊరూరా సర్వే చేస్తాం
యథాతథంగా ప్రభుత్వ కార్యకలాపాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు, మార్కెట్లో నిత్యావసర సరకుల అమ్మకాలు, కొనుగోళ్లు యథాతథంగా కొనసాగుతాయి. సరకులకు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్నందున ఆ దుకాణాలు నడపాలని నిర్ణయించాం. సరకులను దాచి అమ్మే బ్లాక్ మార్కెట్‌గాళ్లను ఉపేక్షించం. కఠిన చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రంలో అంత భయానక పరిస్థితులేం లేవు. కాకపోతే అందరూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – కేసీఆర్
ముందుజాగ్రత్తలే కరోనా నుంచి శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిద్దామని.. రాష్ట్రాన్ని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని పిలుపునిచ్చారు. ఈ మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకుందామన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో కరానా నియంత్రణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. అన్ని జిల్లాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వ్యాధి సోకే ప్రమాదం ఉన్నందున వారి గుర్తింపుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తెలంగాణలో గురువారం వరకు గుర్తించిన కరోనా బాధితులంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని తెలిపారు. రాష్ట్రంలోని వారెవరూ ఈ వ్యాధిబారిన పడలేదని చెప్పారు. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు అన్ని జిల్లాల్లో సర్వే జరపాలని ఆదేశించామని, 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేయాలన్నారు. పదోతరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు చేస్తున్నామన్నారు. 5 గంటలపాటు ఈ సమావేశం సాగింది. మంత్రులు మహమూద్‌అలీ, కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, సబితారెడ్డి, మల్లారెడ్డి, ఉపసభాపతి పద్మారావు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు.
ఎవరికీ ప్రాణాపాయం లేదు
‘‘ఇప్పటి వరకు తెలంగాణలో పాజిటివ్ కేసులు నమోదైనవారంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. వారిలో ఐదుగురు విదేశాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. మిగిలిన వారు ఇతర విమానాశ్రయంలో దిగి బస్సులు, రైళ్లలో మన రాష్ట్రానికి వచ్చారు. వేరే విమానాశ్రయాల్లో దిగి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించడం కష్టం. ఇండోనేసియా నుంచి వచ్చిన వారు కూడా రోడ్డు ద్వారా వచ్చిన వారే. వారిగురించి ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే పరీక్షలు నిర్వహించాకే రాష్ట్రంలోని అనుమతి ఇచ్చి ఉండేవారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 1,165 మంది అనుమానితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం.
విదేశాల నుంచి వస్తే చెప్పండి
మార్చి 1 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అలాంటివారు ఎవరికి వారు అధికారుల వద్ద రిపోర్టు చేయాలి. లేదంటే పోలీస్ శాఖ వారిని గుర్తిస్తుంది. ప్రజలు విదేశాల నుంచి వచ్చిన వారి గురించి 104 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలి. విదేశాల నుంచి వచ్చిన వారు మన మధ్య తిరిగితే వారి వ్యాధి మనకు అంటుకునే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. కర్టాటక, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే వాహనాల్లో విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించేందుకు 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం.
అస్సలు నిర్లక్ష్యం వద్దు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంటిలోనే ఉండాలి. ఎక్కువమంది ఒకేచోట జమకూడకపోవడమే కరోనా కట్టడికి ముఖ్యసూత్రం.. నాకేం కాదు అని ఎవరూ నిర్లక్ష్యం చూపరాదు. జాగ్నేకి రాత్ని కూడా రద్దు చేసుకుంటామని ముస్లింలు అంగీకరించారు. ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఇప్పటికే రద్దు చేశాం. సభలు, సమావేశాలు ఏవైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మందిరాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలను మూసివేయాలి. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు సహకరించాలని కోరుతున్నాం. ఉగాది పండగ నాడు పంచాంగ శ్రవణాన్ని కూడా ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలోనే చూడాలి. దిల్లీలో కూడా ఐదుగురికన్నా ఎక్కువమంది గుమికూడొద్దని నిబంధన పెట్టారు. ఆలయాలు, చర్చిలే బంద్ పెడుతున్నప్పుడు బేషజాలు అవసరం లేదు. షాదీఖానాలు మూసివేయాలని ముస్లిం మతపెద్దలు కూడా కోరారు. ప్రజలను చేరవేసే వాహనాలను పూర్తిస్థాయిలో శుభ్రపర్చాలి. బస్సులు, టాక్సీలు, క్యాబ్‌లలో పరిశుభ్రత స్థాయిని పెంచాలని ఆదేశాలు ఇచ్చాం.
కిరాణా దుకాణాలు తెరిచే ఉంటాయి
- కిరాణా దుకాణాలు, నిత్యావసరాల మాల్స్ అన్నీ తెరిచే ఉంటాయి. మాకు ప్రజా సంక్షేమమే ముఖ్యం.. రైతులకు ఇబ్బంది రాకూడదని వ్యవసాయ మార్కెట్లలో కందులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయి.
పదోతరగతి పరీక్షలు కొనసాగుతాయి
పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. కేంద్రాలలో పక్కాగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించాం. మరో వారంరోజుల్లో ముగుస్తాయి. సమస్యలుండవు.
రాష్ట్రంలో 5 స్క్రీనింగు కేంద్రాలు
దేశంలో వైరస్ పాజిటివ్ తేలిన వారిలో 80.9 శాతంమందికి ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదు. 13.8 శాతంమందికి కొంత ఇబ్బంది ఉంది. 4.7 శాతం ప్రమాదకరస్థాయిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 స్క్రీనింగు కేంద్రాలున్నాయి.’’ అని సీఎం చెప్పారు.
ఈనెల 31 వరకు అన్నీ మూతే
ఎక్కువమంది గుమికూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్య సూత్రం. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, బార్లు, పబ్‌లు, క్లబ్బులు, అమ్యూజ్మెంట్ పార్కులు, జిమ్స్, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు, జూపార్కులు, మ్యూజియంల వంటివన్నీ ఈనెల 31 వరకు మూసేయాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31 తర్వాత కళ్యాణమండపాలు మూసి వేస్తాం. ఇంతకుముందే ఖరారైన వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ 200 మందికి మించకుండా పూర్తి చేసుకోవాలి. బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాపులు, ప్రదర్శనలు, ఉత్సవాలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఈనెల 31 వరకు జరపరాదు.
పారిశుద్ధ్య నిర్వహణకు కమిటీ
- అన్ని జాగ్రత్తలు తీసుకున్నచోట వైరస్ వ్యాపించడం లేదు. పరిశుభ్రత పాటించి మనల్ని మనం కాపాడుకుందాం. పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యానికి కలెక్టర్లు, ఎస్పీలతోఒక కమిటీని వేశాం.
దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఇతర ప్రార్థనామందిరాల్లోకి భక్తులను అనుమతించవద్దు.
విదేశాల్లో మన విద్యార్థులెవరైనా ఉంటే వారిని ప్రత్యేక విమానాల ద్వారా రప్పించాలని కేంద్రాన్ని కోరతాం. అంతర్జాతీయ విమానాలను కేంద్రం ఎప్పుడో రద్దు చేయాల్సింది. ఇప్పటికైనా మించి పోలేదు వాటిని వెంటనే రద్దు చేయాలి. రేపు ప్రధానితో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఇదే మాట చెబుతా.
కరోనాపై పోరుకు రూ. 116.25 కోట్లు
ఇందులో ల్యాబ్‌లు, పరికరాలకు రూ. 33 కోట్లు
హైదరాబాద్: కరోనా వైరస్‌పై సమరానికి ప్రభుత్వం రూ. 116.25 కోట్లు విడుదల చేసింది. రోగులు, అనుమానితుల నుంచి రక్త నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణ, తాత్కాలిక వసతులు, ఆహారం, దుస్తులు తదితరాల కల్పనకు రూ. 83.25 కోట్లు కేటాయించింది. వైద్య పరికరాలు, ల్యాబ్‌లకు రూ. 33 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అదనపు పరీక్షల ల్యాబ్‌లు, పురపాలక, పోలీసు, వైద్య సిబ్బందికి సంబంధించి వ్యక్తిగత రక్షణ పరికరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో థర్మల్ స్కానర్లు, వెంటిలేటర్లు, గాలిని శుద్ధిచేసే పరికరాలను అందుబాటులోకి తేనున్నారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.