*రెమిడెసివిర్.. మొత్తం అమెరికాకే!* *వచ్చే 3 నెలలు ఇతర దేశాలకు దక్కేది శూన్యం*
వాషింగ్టన్, లండన్: కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నవేళ అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై పోరులో సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటివరకు తేలిన ఒకే ఒక్క ఔషధం ‘రెమిడెసివిర్’ రాబోయే మూడు నెలలపాటు తమకు మాత్రమే అందేలా సంబంధిత తయారీ సంస్థ ‘గిలీడ్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా సెప్టెంబరు వరకు ఇతర దేశాలేవీ ఈ ఔషధాన్ని పొందే అవకాశాలు లేవు. కొవిడ్ బాధితుల్లో రెమిడెసివిర్ ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువున్నవారిలో ఐదు రోజుల కోర్సులో భాగంగా దీన్ని వినియోగిస్తున్నారు. భారత్ కూడా ఈ ఔషధ వినియోగాన్ని ఇప్పటికే సిఫార్సు చేసింది.
అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ దాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఒక్కో బాధితుడికి అవసరమయ్యే రెమిడెసివిర్ మోతాదును దాదాపు రూ.1.77 లక్షల చొప్పున ధనిక దేశాలకు విక్రయిస్తామని సంస్థ సోమవారం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సంస్థ వచ్చే మూడు నెలలపాటు ఉత్పత్తి చేసే ఔషధం మొత్తాన్నీ (5 లక్షల డోసులకుపైగా) తమకే సరఫరా చేసేలా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా ఆరోగ్య, మానవ సేవల శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ కొనుగోలు నిర్ణయంపై బ్రిటన్ నిపుణులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇతర దేశాలకు సహకరించేందుకు అమెరికా సుముఖంగా లేనట్లు కనిపిస్తోందని ఆరోపించారు.