*ఏపీ లో 1 నుంచి 6 తరగతులకు 3 విడతల విధానం*
*సబ్జెక్టుకు 3 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు*
*ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠాలు*
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల్లో మూడు విడతల విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యా సంవత్సరాన్ని 3 విడతలుగా విభజించి, పుస్తకాలను రూపొందించారు. ఒక్కో సబ్జెక్టుకు 3 పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అందిస్తారు. ఆంగ్ల మాధ్యమంపై కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో ఇప్పుడు ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలను ముద్రిస్తున్నారు. కన్నడం, తమిళం, ఉర్దూ లాంటి వాటికి ఒకే మాధ్యమం ఉంటుంది. మొదటి విడత పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది.
*ఇదీ కొత్త విధానం*
ఒక్కో సబ్జెక్టులో పాఠ్యాంశాలను మూడుగా విభజించి పుస్తకాలు ఇస్తారు. విడతల వారీగా విద్యార్థుల సామర్థ్యాలు విశ్లేషించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు 1-5 తరగతులకు సమ్మెటివ్ పరీక్షలు రెండు, ఫార్మేటివ్‌లు-4 నిర్వహిస్తుండగా.. వీటిని నిర్వహించాలా? అంతర్గత పరీక్షలతోనే విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలా? అనే దానిపైనా కసరత్తు కొనసాగుతోంది. విద్యార్థుల బ్యాగు మోత తగ్గించేందుకు, ఒత్తిడి నివారణకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.
* భాషలకు సంబంధించి ఒకే మాధ్యమంలో, ఇతర సబ్జెక్టులకు రెండు మాధ్యమాల్లో పాఠాలు ఉంటాయి.
* ప్రతి పుస్తకానికీ ఒక వర్క్‌బుక్ ఉంటుంది. విద్యార్థులు వీటిలోనే తరగతి, హోం వర్కులకు సమాధానాలు రాయాలి.
* మొదటి విడత ముగింపులో విద్యార్థులు అప్పటివరకు నేర్చుకున్న పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది.
* రెండో విడతలో మొదటి విడత నుంచి 20%, ప్రస్తుత పాఠ్యాంశాల నుంచి 80% ప్రశ్నలుంటాయి.
* మూడో విడతలో.. మొదటి, రెండు విడతల పాఠ్యాంశాల నుంచి 10% చొప్పున, ప్రస్తుత పాఠాల నుంచి 80% ప్రశ్నలు ఇస్తారు.