*దవాఖానా మెట్లెక్కితే.. జేబులు ఖాళీ* *80% మంది వైద్య ఖర్చులన్నీ పొదుపు మొత్తాల నుంచే చెల్లింపు*
*13% కుటుంబాలు అప్పుల పాలు* *75వ జాతీయ సర్వేలో వెల్లడి*
దిల్లీ: ఆరోగ్య పరిరక్షణ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అనారోగ్య సమస్యలు తలెత్తితే జీవితకాలంలో పొదుపు చేసుకున్న సొమ్ము ఏ మూలకూ సరిపోవటంలేదు. అప్పుల భారాన్ని తలకెత్తుకోవాల్సివస్తోంది. దేశంలో 80% కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల కోసం స్వీయ ఆదాయాన్ని, దాచుకున్న మొత్తాన్ని ఖర్చుపెట్టుకున్నట్లు 75వ జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. మరో 13% కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం రుణాలపై ఆధారపడుతున్నట్లు తేలింది. దేశంలో ఆరోగ్య రంగ పరిస్థితులను తెలుసుకొనేందుకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ 2017 జులై నుంచి 2018 జూన్ మధ్య సంవత్సరం కాలంలో 64,552 గ్రామీణ, 49,271 పట్టణ ప్రాంత కుటుంబాలను సర్వే చేసింది. మొత్తం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 5,55,115 మంది నుంచి వివరాలు సేకరించింది. దీని ప్రకారం గ్రామీణుల కంటే పట్టణవాసులే ఎక్కువగా ఆసుపత్రులపాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేటు ఆసుపత్రుల వైద్యం ఖర్చు 7 రెట్లు అధికంగా ఉంటోంది. కాన్పులు, సిజేరియన్ల ఖర్చులు ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యధికంగా ఉన్నట్లు వెల్లడైంది.
*సర్వే జరిపిన ఏడాది కాలంలో..*
* 7% మంది గ్రామీణులు, 9% మంది పట్టణ ప్రాంతవాసులు అనారోగ్య కారణంగా 15 రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. వీరిలో అత్యధికులు 60 ఏళ్లకు పైబడిన వారే. ఆ తర్వాతి స్థానంలో 45-59 ఏళ్ల వయసు వారున్నారు. * గ్రామీణ ప్రాంతాల్లో 14%, పట్టణ ప్రాంతాల్లో 19% మందికి మాత్రమే ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. వీరిలో 13% మంది గ్రామీణ, 9% మంది పట్టణ జనాభాకు మాత్రమే ప్రభుత్వాలు కల్పించే ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. *ఆర్థిక స్వతంత్రత* * గ్రామీణ ప్రాంతాల్లో 28% మంది, పట్టణ ప్రాంతాల్లో 33% మంది ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నారు.
* వయోవృద్ధులు గ్రామీణ ప్రాంతాల్లో 4.4%, పట్టణ ప్రాంతాల్లో 3.6% మంది ఒంటరిగానే జీవిస్తున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. గ్రామీణ ప్రాంతాల్లో 7.2% మంది, పట్టణ ప్రాంతాల్లో 5.5% మంది మహిళలు ఒంటరిగా ఉంటున్నారు. *పట్టణ ప్రైవేటు వైద్యం ఖరీదైన వ్యవహారమే..*
* ఆసుపత్రి ఖర్చుల కోసం గ్రామీణ ప్రజలు సగటున రూ.16,676 ఖర్చుపెడితే, పట్టణవాసులు రూ.26,475 వెచ్చించారు. * ప్రభుత్వ ఆసుపత్రుల సగటు వైద్య ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,290, పట్టణ ప్రాంతాల్లో రూ.4,837 ఉండగా, ప్రైవేటు ఆసుపత్రుల సగటు ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో రూ.27,347, పట్టణ ప్రాంతాల్లో రూ.38,822 మేర ఉంది. అంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ఖర్చుల మధ్య ఏడురెట్ల తేడా ఉంది.
* ఆసుపత్రి ఖర్చుల్లో గ్రామీణ వాసులు సగటున రూ.15,937, పట్టణవాసులు రూ.22,031 సొంత జేబుల నుంచే పెట్టుకున్నారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల ఖర్చుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని వారు రూ.4,072, పట్టణ ప్రాంతాల్లో రూ.4,408 ఖర్చుచేయగా, ప్రైవేటు ఆసుపత్రుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని వారు రూ.26,157, పట్టణప్రాంతాల్లో రూ.32,047 ప్రజలు సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ ఖర్చుల కోసం 80% గ్రామీణ ప్రాంత వాసులు సొంత ఆదాయం, పొదుపు నుంచి వాడుకోగా, 13% కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 84% కుటుంబాలు సొంత ఆదాయంపై ఆధారపడగా, 9% మంది అప్పులను ఆశ్రయించాల్సి వచ్చింది.
*ఆసుపత్రి కాన్పులు 90% పైనే..*
* గ్రామీణ ప్రాంతాల్లో 90%, పట్టణ ప్రాంతాల్లో 96% కాన్పులు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. * గ్రామీణ ప్రాంతాల్లో 69% కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 21% ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతుండగా, పట్టణ ప్రాంతాల్లో సగం ప్రైవేటు, సగం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటున్నాయి.
* గ్రామీణ ప్రాంతాల్లో 24%, పట్టణ ప్రాంతాల్లో 41% కాన్పులు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17%, ప్రైవేటు ఆసుపత్రుల్లో 55%గా ఉన్నాయి.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయ్యేవారు గ్రామీణ ప్రాంతాల్లో సగటున రూ.2,404, పట్టణ ప్రాంతాల్లో రూ.3,016 ఖర్చుపెట్టగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పయ్యేవారు గ్రామీణ ప్రాంతాల్లో రూ.20,788, పట్టణ ప్రాంతాల్లో రూ.29,105 వ్యయం చేశారు.
* సాధారణ కాన్పునకు సగటున గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.2,084, పట్టణాల్లో రూ.2,459 ఖర్చవుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.12,931, పట్టణ ప్రాంతాల్లో రూ.17,960 ఖర్చుచేయాల్సి వస్తోంది.
* సిజేరియన్ కాన్పునకు గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.5,423, పట్టణ ప్రాంతాల్లో రూ.5,504 ఖర్చు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ కోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.29,406, పట్టణ ప్రాంతాల్లో రూ.37,508 సగటున ఖర్చు చేయాల్సి వస్తోంది.