విటమిన్లే శ్రీరామరక్ష

Spread the love

*ఆహారం ఆయుధం*

*విటమిన్లే శ్రీరామరక్ష*

*కొవిడ్‌పై పోరులో పండ్లు, కూరగాయలది కీలక పాత్ర*

*పోపులపెట్టె ఔషధశాలే*

*సుగంధ ద్రవ్యాలూ మేలు చేసేవే* *తగు మోతాదులో తీసుకుంటే గొప్ప ఫలితం: వైద్య నిపుణులు*

హైదరాబాద్‌: కొవిడ్‌ బాధితుల చికిత్సలో విటమిన్లకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. విటమిన్‌ సి, డి, జింకు మాత్రలను కచ్చితంగా వాడాల్సిందిగా వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇంత ముఖ్యమైన విటమిన్లను అవసరాల మేరకు మాత్రల రూపంలో తీసుకుంటూనే.. అందుబాటులో ఉండే పండ్లు, కూరగాయల నుంచి స్వీకరించడం ద్వారానూ పొందవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా కరోనా సోకని వారికి వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని చెబుతున్నారు. వంటింట్లో నిత్యం వినియోగించే పోపులపెట్టె కూడా చిన్నపాటి ఔషధశాలగా ఉపయోగపడుతుందంటున్నారు. క్రమం తప్పకుండా తగుమోతాదులో స్వీకరిస్తే మేలు జరుగుతుందంటున్నారు. *వంటింటి ఔషధాలు* మిరియాలు, శొంఠి, పిప్పళ్లు కలిపిన త్రికటు చూర్ణం… దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తదితర సుగంధ ద్రవ్యాలు ఏవైనా యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియాగా ఉపయోగపడతాయి. రక్తప్రసరణను మెరుగుపర్చుతాయి. వీటితో తయారు చేసిన కషాయాన్ని తీసుకోవచ్చు. *తానికాయతో గుండె పనితీరు మెరుగు* _ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను కలిపి త్రిఫలాలంటారు. ఈ సమయంలో త్రిఫల చూర్ణం వాడుకోవడం మేలు చేస్తుంది. కరక్కాయ జీర్ణ వ్యవస్థపై, తానికాయ ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగుపర్చడంపై బాగా పనిచేస్తాయి._ *ఏం తినాలి? ఎలా తినాలి?* కరోనా నుంచి బయటపడడంలో రోగి తినే ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది. వంటిల్లే ఔషధ గనిగా ఉపయోగపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్లు… మనం రోజూ తినే ఆహార పదార్థాల్లోనే మెండుగా లభిస్తాయి. ఎందులో ఏయే విటమిన్లుంటాయి? వేటిని ఎలా తినాలో తెలుసుకుని వినియోగిస్తే ఆరోగ్యం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు.

*విటమిన్‌ ఎ* _యాంటీ జెన్‌, యాంటీబాడీస్‌ పనిచేయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలాన్ని రక్షిస్తుంది._ * చిలగడదుంప(స్వీట్‌ పొటాటో), క్యారెట్‌, బీట్‌రూట్‌, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్‌, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తుంది.

*విటమిన్‌ డి* _హానికారక అతి సూక్ష్మక్రిముల సంహారానికి, మేలు చేసే సూక్ష్మక్రిముల వృద్ధికి దోహదపడుతుంది._ * పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, కాలేయంలో ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళ సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి.

*విటమిన్‌ ఇ* _కణం ఆకృతి చక్కగా రూపాంతరం చెందాలంటే చాలా ముఖ్యం. యాంటాక్సిడెంట్లుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంపొందించడంలో పనిచేస్తుంది._

* పసుపు, సెనగలు, కరివేపాకు, ఎండుకొబ్బరి, పొద్దు తిరుగుడు, అవిసె గింజలు, బాదం, పిస్తాల్లో లభిస్తుంది. *విటమిన్‌ సి* _కణాల మరమ్మతుకు, పునరుత్పత్తికి విటమిన్‌ సి బాగా ఉపయోగపడుతుంది. కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీబాడీస్‌ను ప్రేరేపిస్తుంది._ * అన్ని రకాల ఆకుపచ్చని కూరగాయలు, దేశీయ జామ, పచ్చిమామిడి, దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష తదితర పుల్లని పండ్లతోపాటు బొప్పాయి, ఎర్రతోటకూర, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్‌లో ఎక్కువగా లభిస్తుంది.

*విటమిన్‌ బి12* _రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నరాల వ్యవస్థను, జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చుతుంది. పేగుల నుంచి రక్తనాళాలకు పోషకాలు చేరడంలో సహకరిస్తుంది._

* చేపలు, మాంసం, చికెన్‌, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఎండుద్రాక్షల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.

*ప్రొటీన్లు* _ఈ తరహా ఆహారాలు ఆరోగ్యవంతంగా ఉండేలా, త్వరగా కోలుకునేలా చేస్తాయి._

* సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్‌, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్‌, మటన్‌, చేపలు, పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

*యాంటీబాడీస్‌ వృద్ధిలో పోషకాలకు ప్రాధాన్యం* శరీరం ఇన్‌ఫెక్షన్ల బారినపడిప్పుడు.. వాటిని ఎదుర్కోవడంలో రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా వంటి వైరస్‌ దాడిచేసిన సందర్భాల్లో.. ఎక్కువ మోతాదులో విటమిన్లు, మినరల్స్‌, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాలు అవసరమవుతాయి. యాంటీబాడీస్‌ లభించే వివిధ కాయగూరలు, పండ్లతోపాటు ఆకు కూరలను ఒక్కో వ్యక్తి రోజుకు 50-100 గ్రాముల వరకూ తీసుకుంటుండాలి. పల్లీ, సోయాబీన్‌, నువ్వులు, పొద్దుతిరుగుడు, రైస్‌బ్రాన్‌ తదితర నూనెలను తగు మోతాదులో మార్చుకుంటూ వాడుకోవాలి. ఇవి శరీరంలో అంతర్గత ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. – *డాక్టర్‌ జానకీ శ్రీనాథ్‌, పోషకాహార నిపుణులు, కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్‌లో అధ్యాపకురాలు* *వేపుళ్లతో విటమిన్లు దూరం* ఎటువంటి ఆహారం తింటున్నాం? ఎలా తింటున్నాం? ఎంత తిన్నాం? అనేది చాలా ముఖ్యం. కొవిడ్‌ బారినపడిన సమయంలో ఆకలి నశిస్తుంది. కాబట్టి ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటే ఒంటపడుతుందనేది గ్రహించాలి. మితంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. అప్పుడు రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి, వైరస్‌పై పోరుకు బలం పెరుగుతుంది. కూరగాయలను అతిగా ఉడికించినా, వేపుడు చేసిన విటమిన్లు నశిస్తాయి. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినడం ఉపయోగం. క్యారెట్‌, బీట్‌రూట్‌, కీరదోసకాయ వంటి వాటిని ముక్కలుగా తరిగి.. వాటిపై పుదీనా, కొత్తిమీర, కరివేపాకును సన్నగా తురిమి వేసి.. కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి తింటే రుచిగా ఉంటాయి. పోషకాలూ లభిస్తాయి. *-డాక్టర్‌ రవీందర్‌ చిలువేరు, విశ్రాంత ప్రధానాచార్యులు, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్‌*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *