“మాకు బుద్ధి లేదు వర్మ.. నువ్వు ఏం తీస్తావో తెలిసి కూడా నువ్వు తీసిన సినిమాను ఎగబడి చూశాం చూడు. నిజంగా మాకు బుద్ధి లేదు. మాకు నువ్వే కరెక్ట్. మా బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం బాగా తెలిసిన వ్యక్తివి నువ్వే. ఓ పనికిమాలిన సినిమాకు దాదాపు 3 వందల రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెట్టామనే బాధ కంటే, సినిమా చూసిన తర్వాత కలిగిన వికారం చాలా ఎక్కువగా ఉంది వర్మ.”
ఈరోజు వర్మ విడుదల చేసిన పవర్ స్టార్ అనే సినిమా చూసిన తర్వాత కలిగిన ఫీలింగ్ ఇది. ట్రయిలర్ లో చూసిన బొమ్మ కంటే సినిమాలో పెద్దగా విషయం ఉండదనే రిమార్క్ వర్మపై చాన్నాళ్లుగా ఉంది. దాన్ని పవర్ స్టార్ సినిమాతో మరోసారి రుజువు చేశాడు ఈ అతి తెలివి దర్శకుడు.
ఫ్లోలో సినిమా అనే పదం వచ్చేస్తోంది కానీ ఇది సినిమా కాదు.. షార్ట్ ఫిలిం అని కూడా సంభోదించలేని 37 నిమిషాల చెత్త దృశ్యం. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి కాబట్టి వర్మ తీసిన ఈ “ఆణిముత్యాన్ని” వెబ్ మూవీ అందాం. (నిజంగా మనసుపెట్టి వెబ్ మూవీస్ తీసేవాళ్లు బాధపడితే అది మా తప్పు కాదు, వెళ్లి వర్మను ప్రశ్నించండి)
ఇక ఈ “వెబ్ మూవీ”లోకి వెళ్దాం.. ట్రయిలర్ లో ప్రవన్ పాత్రధారితో, అతడి పెద్దన్నయ్య మాట్లాడే సీన్ ఉంది. (నిజ జీవితంలో ఇవి ఏ పాత్రలనేవి మేం చెప్పనక్కర్లేదు) ఈ సీన్ కు కొనసాగింపుగా ఇంకొక్క సీన్ మాత్రమే ఈ వెబ్ మూవీలో ఉంది. ఇదే ట్రయిలర్ లో విక్రమ్ అనే దర్శకుడ్ని ప్రవన్ కళ్యాణ్ కొడతాడు. దానికి ముందు వెనక ఓ 2 డైలాగ్స్ వేసుకోండి ఆ సీన్ పూర్తయిపోతుంది.
రష్యన్ వైఫ్ తో ప్రవన్ మాట్లాడతాడు. గుండ్ల రమేష్ ప్రవన్ ను నవ్విస్తాడు. తెలుగు ప్రజలకు బాగా తెలిసిన ఓ రాజకీయ నాయకుడికి ప్రవన్ కు మధ్య ఓ సీన్ ట్రయిలర్ లో కనిపిస్తుంది. అంతకుమించి వెబ్ మూవీలో ఏం లేదు.
ఇలా ట్రయిలర్ కు కొనసాగింపుగా మాత్రమే పవర్ స్టార్ ఉంది. దీనికితోడు నిన్ననే మరో 3 టీజర్లు వదిలాడు వర్మ. అవి కూడా చూసేసిన తర్వాత ఇక పవర్ స్టార్ లో చూడడానికి ఇంకేం లేదు. క్లైమాక్స్ లో వర్మ వచ్చి ప్రవన్ కల్యాణ్ కు “వర్మోపదేశం” చేసే సీన్ మాత్రం ట్రయిలర్ లో లేదు. ఇక ఆ సీన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటివరకు ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ ఖాతాలకే పరిమితమైన పైత్యం మొత్తాన్ని సినిమా క్లైమాక్స్ లో ఒలకబోశాడు వర్మ. అప్పటికే సన్నివేశాల మధ్య లింకు లేక, ఏం చూస్తున్నామో అర్థంకాక ఓ రకమైన చిరాకుతో ఉన్న నెటిజన్ కు (వెబ్ ప్రేక్షకుడు అని కూడా అనుకోవచ్చు) వర్మ ప్రవచనాలతో వికారం మొదలవుతుంది. ఇక చాల్రా బాబు ఆపు అనేలోపు వర్మే సినిమా ఆపేస్తాడు.
ఇదీ సింపుల్ గా పవర్ స్టార్ సినిమా కథ కమ్ రివ్యూ. ఇందులో నటీనటుల పనితీరు గురించి, టెక్నీషియన్స్ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం దండగ. నటీనటులంతా మిమిక్రీ చేశారు. టెక్నీషియన్స్ అంతా తమకుతోచింది చేశారు. ఓవరాల్ గా అటుఇటుగా 10 లక్షల రూపాయల ఖర్చుతో (రెమ్యూనరేషన్స్ కలిపి) తీసిన ఈ సినిమాతో వర్మ కోటి రూపాయలు సంపాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సినిమా అంటే బలహీనమున్న ప్రేక్షకులు చాలామంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో.