*పాఠశాల విద్యలోకి ఇంటర్‌

Spread the love

*పాఠశాల విద్యలోకి ఇంటర్‌*

*తెలుగు రాష్ట్రాలపై అధిక ప్రభావం* *అమలుపై విద్యావేత్తల సందేహాలు* జాతీయ నూతన విద్యావిధానం అమలులోకి వస్తే తెలుగురాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.12వ తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో ఉన్నతవిద్య పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్‌ బోర్డులు పాఠశాల విద్య కిందికి రానున్నాయి. ఫలితంగా జూనియర్‌ కళాశాలలు ఇక నుంచి అవే పేరుతో పనిచేస్తాయా? వాటిని కూడా పాఠశాలలుగా మారుస్తారా అనే చర్చ సాగుతోంది. కళాశాలల్లోనే కింది తరగతులను కూడా ప్రారంభించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్య నిర్మాణం 5+3+3+4 లాగా మార్చినా ఒక్కో దశకు ఒక్కో పాఠశాల ఏర్పాటు చేయరని చెప్పారు.

పాఠశాల విద్య పరిధిలోకి వచ్చినా ఇంటర్‌బోర్డు మనుగడలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. *పలు భాషల వారుంటే ఎలా?* అయిదో తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలని కేంద్రం నిర్ణయించగా దాన్ని అమలు చేయడంలో సమస్యలు తప్పవని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్‌ లాంటి నగరాల్లో పలు రాష్ట్రాల వారు నివసిస్తున్నందున పలు భాషల వారు ఒక పాఠశాలలోని ఒక తరగతిలో ఉంటే ఏ భాషలో బోధించాలన్నది సమస్యవుతుందని విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ చెప్పారు. ఏ భాషలో బోధించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులకు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని, ఇటీవల ఏపీలో ఆంగ్ల మాధ్యమం అన్నప్పుడు అదే విషయం చెప్పిందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు.

ప్రభుత్వ బడులకు ఊతం విద్యా హక్కు చట్టం కిందికి 3-18 సంవత్సరాల వయసు వారిని తీసుకురావడంతో అది ప్రభుత్వ బడులకు ఊతంగా మారనుంది.

శిశు తరగతులకు మూడేళ్లు కేటాయించడంతో ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో వాటిని ఏర్పాటుచేయనున్నారు. ఒక వేళ అంగన్‌ వాడీ కేంద్రాలున్నా వాటిని పాఠశాలల ప్రాంగణాల్లోకి మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఒక సిలబస్‌ లేకుండా నడుస్తున్న శిశు తరగతులు గాడినపడనున్నాయి.

దీనివల్ల సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగనుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు శిశు తరగతులు లేకపోవడం ప్రభుత్వ బడులకు ఒక లోపంగా ఉందని వారు తెలిపారు.

*డిగ్రీ కళాశాలలకు చిక్కే..* విశ్వవిద్యాలయాలు కాకుండా స్వయంప్రతిపత్తి కళాశాలలే ఉంటాయని చెబుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలకు చిక్కులు రానున్నాయి. స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంటే న్యాక్‌ గ్రేడ్‌ ఉండాలి. అది దక్కాలంటే సొంత ప్రాంగణం తప్పదు. ఏపీ, తెలంగాణలో 80 శాతానికిపైగా డిగ్రీ కళాశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఫలితంగా వందలాది కళాశాలలను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *