ప్రధాని నరేంద్ర మోదీ నేడు ”ఫిట్ ఇండియా డైలాగ్” కార్యక్రమంలో భాగంగా క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ, నటుడు మిలింద్ సోమన్ తదితర ఫిట్‌నెస్ యోధులతో వీడియో మాధ్యమంలో ముచ్చటించారు. ఈ క్రమంలో మిలింద్, మోదీల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వారిద్దరూ ఒకరి సందేహానికి మరొకరు వివరణ ఇచ్చారు.
నటుడు మిలింద్ సోమన్‌తో ప్రధాని మాట్లాడుతూ ”మీరు మీ వయసెంతో(55) చెప్పారు.. కానీ మీకు నిజంగా అంత వయస్సు ఉందా?” అని ప్రశ్నించారు. ఇందుకు ”నన్ను చాలా మంది మీకు నిజంగా 55 ఏళ్లా? అని అడుగుతుంటారు. మరి ఈ వయసులో 500 కి.మీ ఎలా పరిగెత్తగలనని కూడా వారు ఆశ్చర్యపోతుంటారు.
అందుకు జవాబుగా నేను 81 ఏళ్లున్న మా అమ్మగారి గురించి చెబుతాను. నేను ఆ వయసుకు చేరేప్పటికి ఆమెలా ఉండాలని ఆశిస్తున్నాను. మా అమ్మ, నాకు, మరెంతో మందికి ఓ మంచి ప్రేరణ.” అని మిలింద్ జవాబిచ్చారు. కాగా, ఇదివరకు మిలింద్ తల్లి ఉషా సోమన్ వ్యాయామం చేస్తున్న వీడియోను చూసిన ప్రధాని ఆమెను అభినందించిన సంగతి తెలిసిందే.
కాగా ‘ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు’ అని మిలింద్ సోమన్ మోదీని ప్రశ్నించారు. దానికి ”మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం.. ఏమీ ఆశించకుండా, ఓ బాధ్యతగా భావించి సేవ చేసినపుడు ఏ పని చేసినా, ఎంత పని చేసినా ఒత్తిడి ఉండదు. పైగా మరింత శక్తి లభిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రతిస్పర్ధ ఫిట్‌నెస్‌కు చిహ్నం.” అని ప్రధాని వివరించారు. అంతేకాకుండా మిలింద్ రచించిన ‘మేడిన్ ఇండియా’ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. తన ‘మేక్ ఇన్ ఇండియా’ మంత్రాన్ని గురించి ఆయన వివరించారు. ఓ దశలో ‘మేడిన్ ఇండియా మిలింద్’ అంటూ నటుడిని ఆయన ప్రశంసించారు.