ఒకే ఒక్క సినిమా పాటతో టాలీవుడ్లో పాపులర్ అయిన గాయకుడు పుట్టా పెంచల్దాస్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో పెంచల్దాస్ ఆలపించిన జానపద గేయం ఉర్రూతలూగించింది.
‘దారి చూడు దుమ్ము చూడు మామ.. దున్న పోతుల బేరే చూడూ.. కమలపూడి కమలపూడి కట్టమిందా మామ.. కన్నె పిల్లల జోరే చూడు.. కమలపూడి కట్టమిందా మామ..’ అంటూ సాగే ఈ పాటలో మాస్ అపీల్ ఉండడంతో పాపులర్ అయింది. పాటకు తగ్గట్టు హీరో నాని లుంగీ కట్టుకుని చేసిన మాస్ డ్యాన్స్ అదరగొట్టింది. ఈ పాటలో గాయకుడు పెంచల్దాస్ కూడా నటించడం విశేషం.
ఆ పాట తర్వాత యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవిందసమేత వీరరాఘవ సినిమాకు కూడా చక్కని పాట పెంచల్దాస్ అందించారు.
ఈ చిత్రంలో ‘ఊరికి ఉత్తరాన దారీకి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా … రెడ్డెమ్మ తల్లి , చక్కానైన పెద్దా రెడ్డెమ్మా. నల్లా రేగడి నేలలోన, ఎర్రాజొన్న చేలల్లోన, నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డమ్మా తల్లి. గుండెలవసి పోయె కదమ్మా’ అంటూ భర్త హత్యకు గురయ్యాడనే విషాదకర సమాచారాన్ని ఎంతో ఆర్ధతతో చెబుతూ సాగిన అద్భుతమైన పాట టాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ పాటలు ఆ సినిమాలకు సగం బలం అంటే అతిశయోక్తి కాదు.
కడప జిల్లా చిట్వేలి మండలానికి చెందిన పెంచల్దాస్ వృత్తిరీత్యా డ్రాయింగ్ మాస్టర్ (కాంట్రాక్ట్ ఉద్యోగి). అతనిలో మంచి చిత్రకారుడు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన యువదర్శకుడు మేర్లపాక గాంధీ ఆయనకు మొట్ట మొదటి సారిగా సినిమాలో పాడే అవకాశం కల్పించారు. కృష్ణార్జున యుద్ధం సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న పెంచల్దాస్ , ఆ తర్వాత రెండు మూడు సినిమాలకు మాత్రమే పాటలు రాశారు.
సుదీర్ఘ విరామం తర్వాత శ్రీకారం సినిమాలో మరో సీమ జానపదాన్ని ఆలపించారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక పెంచల్దాస్ విషయానికి వస్తే … ‘వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పోయే అలకల చిలుక భలేగుంది బాలా’ అంటూ చక్కటి జానపద గేయాన్ని ఆలపించారు. తాజాగా పాట విడుదలను పురస్కరించుకుని మిక్కీ జే మేయర్ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
భలేగుంది బాలా రాయలసీమ నేపథ్యంలో మెలోడీగా సాగే అద్బుతమైన జానపద పాట అని మిక్కీ అన్నారు. పెంచల్ దాస్ రాసి పాడిన పాట బాగుందన్నారు. ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను అని ఆయన చెప్పుకొచ్చారు. పెంచల్ దాస్ తో పని చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.